విద్యపై పెట్టే ఖర్చు విద్యార్థుల భవిష్యత్‌కు పెట్టుబడి
కోటపల్లి, ఆగస్టు 19: ప్రభుత్వం విద్యారంగంపై పెట్టే ఖర్చు విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖామంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. బుధవారం చెన్నూర్ నియోజక వర్గంలోని కోటపల్లి మండల కేంద్రంలో రూ. 50 లక్షల సి.ఎస్.ఆర్. నిధులతో బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదులు, మరమ్మత్తుల పనులకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, గిరిజన సంక్షేమ అధికారి సురేష్, మండల తహసిల్దార్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ పాఠశాలకు రూ. 50 లక్షల సి.ఎస్.ఆర్. నిధులు, రూ. 30 లక్షల డి.ఎం.ఎఫ్.టి. నిధులు మంజూరు చేయడం జరిగిందని, విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తు న్నామన్నారు. భీమారంలో భోజనశాల, అదనపు గదులు ఏర్పాటు, జైపూర్ కేజీబీవీలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చేరుతున్నారని, రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాలో 6.14 శాతం అదనంగా విద్యార్థుల నమోదు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.






