20 August, 2026 | 3:56 AM

10 రోజుల్లో రూ.కోటి రికవరీ

20-08-2026 01:14 AM

ఆ నగదును బాధితుడికి అందజేసిన పోలీసులు

శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (విజయక్రాంతి): కంపెనీ యజమాని పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి కోటి రూపాయలు స్వాహా చేసిన సైబర్ మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకొని ఆ మొత్తం డబ్బును పూర్తిగా బాధితుడికి అందించారు. కేసుకు సం బంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 4న ఒక చీరల రిటైల్ సంస్థ అకౌంటెంట్‌కు యజమాని పేరుతో సందేశం వచ్చింది.

అది నిజమేనని నమ్మిన అకౌంటెంట్ సంస్థ కరూర్ వైశ్య బ్యాంక్ ఖాతా నుంచి రూ.1 కోటిని ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు.వెంటనే ఫిర్యాదు అందగానే సైబర్ క్రైమ్ బృందం దర్యాప్తు ప్రారంభించింది.దర్యాప్తులో డబ్బు రాయల్ మోడా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న కార్పొరేట్ ఖాతా ద్వారా మళ్లించినట్లు బయటపడింది.ఈ ఖాతాను మ్యూల్ అకౌంట్‌గా వాడుతున్నారు. బ్యాంకు లావాదేవీలు, నిధుల కదలికల విశ్లేషణతో లక్నోకు చెందిన దీపక్ కుమార్ (37)ను గుర్తించారు.

ఈ నెల 8న లక్నోలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్ తీసుకుని సైబరాబాద్‌కు తీసుకొచ్చారు. కూకట్‌పల్లి కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. న్యాయస్థానం సకాలంలో ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నెల 14న, ఘటన జరిగిన కేవలం 10 రోజుల్లోనే కోటి రూపాయాలు బాధితుడికి తిరిగి అందింది.