30 April, 2026 | 4:29 AM

విస్తరణ అస్తవ్యస్తం.. ప్రయాణం ఆగమాగం..!

30-04-2026 12:58 AM
  1. చౌటుప్పల్‌లో రోడ్డు విస్తరణ పనులు జాప్యంతో తప్పని తిప్పలు
  2. రోడ్డున పడుతున్న చిరు వ్యాపారులు
  3. పిల్లర్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని వేడుకోలు

చౌటుప్పల్, ఏప్రిల్ 29 :  రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులు అటు ప్రజలకు ఇటు వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి.హైదరాబాదు విజ యవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్య ప్రభుత్వ నిర్ణయం మేర కు 2010 లో జిఎంఆర్ సంస్థ నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టింది.అయితే నాలుగు వరుసల జాతీయ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే స్థలాలను బ్లాక్ స్పాట్ గా భారత జాతీయ రహదారుల ప్రాధికారిత సంస్థ గుర్తించింది.

దీనిలో భాగం గా రాజధానికి కూతవేటు దూరంలో జాతీ య రహదారిపై  ఉన్న చౌటుప్పల్ ప్రాంతా న్ని కూడా తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతంగా గుర్తించి అండర్ పాసుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది.అండర్ పాసుల నిర్మాణంలో భాగంగా మట్టి కట్టలతో ముం దుగా ప్రతిపాదించిన విధంగా కాకుండా మార్పులు చేస్తూ నిర్మాణం చేస్తున్నారు

బస్టాండు ప్రాంతంలో 20 మీటర్ల అండర్ పాస్ నిర్మాణం, చిన్నకొండురు తంగడపల్లి చౌరస్తా లో పిల్లర్లతో కూడిన నిర్మాణం మరియు భాస్కర్ థియేటర్ కి సమీపాన 3 మీటర్ల అండర్ పాసు మరియు వలిగొండ రోడ్ చౌరస్తా లో 30 మీటర్ల అండర్ పాసు నిర్మాణాలు చేపట్టింది.అయితే లక్కారం దగ్గర ఉన్న దర్గా నుండి వలిగొండ చౌరస్తా వరకు మట్టి కట్టలతో నిర్మాణం ప్రతిపాదించినప్పటికీ దర్గా నిర్మాణం తొలగించకపోవ డంతో కొద్దిగా ముందుకు జరిగి నిర్మాణం చేపట్టడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

పెరిగిన రద్దీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ చుట్టుపక్కల 5 నుండి 6 మండలాలకు వాణిజ్య కేంద్రం. చౌటుప్పల్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల రసాయన పరిశ్రమలలో పనిచేసి వారు వే లాది మందికి ఆవాసంగా మారిన ప్రాంతం. రెండు రాష్ట్రాలకు చెందిన అనేక వాహనాలు పయనించే మార్గం కావడంతో విపరీతమైన రద్దీ కలిగి ఉంటుంది.

మారిన ముఖచిత్రం..

మున్సిపాలిటీగా మారిన తర్వాత చౌటుప్పల్ దినదినాభివృద్ధి చెందుతోంది.హైదరా బాదుతో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతుంది.రాజధానికి కూతవేటు దూరం ఉండ డంతో చాలా త్వరిత గతిన అభివృద్ధికి బాటలు పడ్డాయి.

చిరు వ్యాపారస్తులకు తప్పని తిప్పలు

బస్టాండు నుండి వలిగొండ రోడ్డు వరకు చిరు వ్యాపారస్తులు పళ్ళు, పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అండర్ పా స్  మట్టి కట్టలతో నిర్మిస్తుండటంతో వారికి జీవనోపాధి కోల్పోతున్నారు. వ్యాపారానికి చోటు లేక రోడ్డున పడుతున్నారు.

ముక్కలుగా చౌటుప్పల్..

అండర్ పాస్ మట్టి కట్టలతో నిర్మిస్తుండటంతో చౌటుప్పల్ రెండు ముక్కలుగా చీలి పోతుంది.దీంతో రోడ్డు వెంట ఉండే దుకాణ సముదాయాలు తీవ్రంగా దెబ్బతింటాయి.. లక్షలు పోసి అప్పులు చేసి మరీ షాపులను అభివృద్ధి చేసుకున్న వ్యాపారస్తులు దివాలతీయడం  ఖాయంగా కనిపిస్తుంది.

ఇదీ పరిష్కార మార్గం...;

మట్టి కట్టలతో అండర్ పాసు నిర్మిస్తున్న ప్రభుత్వం పిల్లర్ లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే చిరు వ్యాపారస్తులకు న్యాయం జరుగుతుంది.అలాగే రోడ్డు వెంట ఉన్న షాపులు కూడా అభివృద్ధి చెందుతాయి. నిత్యం రద్దీగా ఉన్న చిన్న కొండూరు,తంగడపల్లి, వలిగొండ రోడ్లను కూడా విస్తరించాలి.

పెరుగుతున్న జనాభా దృష్ట్యా, నియోజకవర్గాల పునర్విభజనలో రాబోయే రోజుల్లో నియోజకవర్గంగా మారుతుందన్న వాదన బలంగా వినిపిస్తుండడంతో అడ్డదిడ్డంగా రోడ్డు విస్తరణ పనులు చేయకుండా ప్రజలకు నష్టం కలిగించే విధంగా కాకుండా చిరు వ్యాపారస్తులకు అన్ని వ్యాపార సముదాయాలకు ప్రజలకు ఉపయోగకరంగా నిర్మాణాలు చేపట్టాలని  వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు కోరుతున్నారు.

వ్యాపారస్తుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి         

‘అనాలోచితంగా చేస్తున్న అండర్ పాస్ ని ర్మాణాలతో చిరు వ్యాపారస్తుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. పిల్లర్లతో కారిడార్ ఏ ర్పాటు చేయడం ద్వారా వారికి కొంత వరకు ఉపాధి లభిస్తుంది. ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ప్రభు త్వం తీసుకొని నాణ్యమైన పిల్లర్ల నిర్మాణాలను చేపట్టి చౌటుప్పల్ లో మరో ప్రమాదం జరగకుండా చూడాలి. నత్తనడకన సాగుతున్న నిర్మాణపనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల అసౌకర్యాన్ని తొలగించాలి.’

వరగంటి భానుప్రకాష్, స్థానికుడు