26 June, 2026 | 10:40 PM

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

26-06-2026 09:28 PM

- కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణపై దృష్టి పెట్టాలి

- బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

చుంచుపల్లి,(విజయక్రాంతి): ఓటర్ల జాబితా పక్కాగా ఉంటేనే ప్రజాస్వామ్య బలోపేతం సాధ్యమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని సిపిఐ మండల కార్యాలయం 'రజబ్ అలీ భవన్'లో  చుంచుపల్లి మండల స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్ఏ)ల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అయన బిఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ, క్రమబద్ధీకరణపై, బిఎల్ఏల విధులపై అవగాహనా పెంచుకోవాలని, పోలింగ్ కేంద్రాల పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు.

18 ఏళ్లు నిండిన యువతీ యువకులను గుర్తించి కొత్త ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. మరణించిన వారి పేర్లు, ఒకే పేరుతో రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలన జరపాలని కోరారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు. సర్ ప్రక్రియలో పార్టీ బిఎల్ఏ అప్రమత్తంగా ఉండాలని, బిఎల్వో లకు సహకరిస్తూ సమగ్ర ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు సహకరించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బిఎల్ఏల పాత్ర అత్యంత కీలకమైనదని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తమ విధులను పూర్తి బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. సమావేశంలో మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు జి వీరాస్వామి, నాయకులు మహేష్, భూక్యా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.