calender_icon.png 15 February, 2026 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద పట్నానికి సర్వం సిద్ధం

15-02-2026 01:18:39 AM

తరలిరానున్న భక్తులు 

అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

కొమురవెల్లి,ఫిబ్రవరి 14(విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో నిర్వహించే కార్యక్రమాలలో ప్రధాన ఘట్టాలలో ఒకటైన పెద్దపట్నం కార్యక్రమాన్ని మహాశివరాత్రి రోజున నిర్వహించడానికి ఆలయ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. ఆదివారం రాత్రి ప్రారంభించి సోమవారంతెల్లవారుజాము వరకు ఈ కత్రువు  కొనసాగుతుంది. స్వామివారికి పట్నం వేయడం అంటే యాదవుల ఆచార ప్రకారం స్వామి వారికీ కళ్యాణం చేయడమే.

స్వామి వారి కళ్యాణం మల్లన్న క్షేత్రంలో రెండుసార్లు జరుగుతుంది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణం జరుపుతారు.మరల మహాశివరాత్రి రోజు యాదవుల సంప్రదాయ ప్రకారం పెద్దపట్నం ( కళ్యాణం) వేసి స్వామి వారి కళ్యాణం జరుపుతారు. ఇలా రెండుసార్లు మల్లికార్జున స్వామి పెళ్ళికొడుకు అవుతాడా అన్న మాట. మల్లన్న క్షేత్రానికి వచ్చే భక్తులు ఎక్కువ శాతం పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు.

ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పట్నాలు వేయించుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిధిలోని తొట బావి దగ్గర పెద్దపట్నాన్ని ఒగ్గు పూజారులు రచిస్తారు.ఈ పట్నానికి పసుపు, కుంకుమ, తెల్ల పిండి, పచ్చ (తంగేడు ఆకుతో తయారు చేసేది) బుకా గులాలు (గులాబీ రంగు కుంకుమ) వాడతారు.పట్నంలోకి మల్లికార్జున స్వామిని ఆహ్వానించి కళ్యాణం చేసి తమ కోరికలను విన్న వించుకుంటారు.  పెద్దపట్నం వేసేముందు ఒగ్గు పూజారులు తమ ఆచారం ప్రకారం గర్భాలయంలోని మూలవిరాట్‌కు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

మహాశివరాత్రి రోజు గర్భగుడిలో లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, స్వామివారి సేవ, ఊరేగింపు తదితర కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. ఇప్పటికే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో టంకశాల వెంకటేష్ తెలిపారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో సుమారు 300 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.