‘ఎల్ నినో’ సవాళ్లపై పక్కా ప్రణాళిక
- వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు
- ప్రత్యామ్నాయ పంటలే రైతాంగానికి మేలు
- సోలార్ విద్యుత్ వినియోగంతో తగ్గనున్న ఆర్థిక భారం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ సదస్సు
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): వాతావరణంలో ఎల్ నినో మార్పులతో రాష్ట్ర ప్రజలపై, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్ధత వరకు అనే అంశంపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సుకు మంత్రి అజారుద్దీన్‌తో కలిసి డిప్యూటీ సీఎం హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేవలం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, ఎల్ నినో ప్రభావంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమధ్య రేఖా పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఉష్ణోగ్రతల మార్పులు తెలంగాణలోని చెరువులు, వాగులు, గ్రామాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో శాస్త్రవేత్తల ద్వారా విశ్లేషింపజేసి, సమర్థవంతమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
తాగునీరు, సాగునీటితో పాటు పశువులు, పక్షులు, అడవి జంతువుల నీటి, ఆహార అవసరాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఎవరికి వారు సంసిద్ధమయ్యేలా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని భట్టి స్పష్టం చేశారు.
వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు నిపుణుల సూచనల మేరకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఎల్ నినో వల్ల పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వం అత్యంత సమర్థవంతమైన ’ఎనర్జీ మేనేజ్మెంట్’ అమలు చేస్తోందని వివరించారు. పగటి పూట విరివిగా, తక్కువ ధరకు లభించే సౌర విద్యుత్‌ను (సోలార్ పవర్) గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.
వర్షాకాలంలోనూ వేసవి స్థాయి డిమాండ్
ఉష్ణోగ్రతలు పెరగడంతో పగలు, రాత్రి అనే తేడా లేక ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, బోర్వెల్స్, లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల వాడకం భారీగా పెరిగిందని భట్టి తెలిపారు. సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుంది, కానీ ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో ప్రస్తుత డిమాండ్ ఏప్రిల్ (వేసవి) నాటి గరిష్ట (పీక్) స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సీజన్లకు అనుగుణంగా విద్యుత్ వినియోగంలో మార్పులు వస్తున్నాయని, పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా ఎనర్జీ ప్లానింగ్ రూపొందించుకోవడంలో తెలంగాణ ముందుంటుందని తెలిపారు.
వ్యవసాయ, విద్యుత్, సాగునీటి భూగర్భ జల శాఖలతో పాటు అనుబంధ శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుని సదస్సును నిర్వహించడం ప్రణాళికా శాఖ ప్రతిభకు, సామాజిక బాధ్యతకు నిదర్శనమని కొనియాడారు. ఇటువంటి అవగాహన సదస్సులను భవిష్యత్తులో జిల్లాల వారీగా కూడా నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేస్తూ పూర్తి స్థాయి చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.






