28 February, 2026 | 4:44 AM

అంతా నిర్దోషులే

28-02-2026 02:54 AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. 23 మందికి క్లీన్‌చిట్ 

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు

కేజ్రీవాల్, సిసోడియా, కవితకు విముక్తి

  1. సీబీఐ చార్జిషీటుకు, సమర్పించిన ఆధారాలకు పొంతన లేదని కోర్టు మండిపాటు
  2. దర్యాప్తు అధికారుల్లో ఆర్థిక నిరక్షరాస్యత కనిపించిందని వ్యాఖ్య
  3. వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశం
  4. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ
  5. నేను నిజాయతీపరుడినని తేలిపోయింది
  6. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షానే మాపై కేసులు బనాయించారు.. 
  7. బీజేపీకి దమ్ముంటే ఢిల్లీలో ఎన్నికలు పెట్టాలి.. ఎన్నికల్లో ఆ పార్టీ ౧౦ సీట్లు సాధించినా రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేజ్రీవాల్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౨౭: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిం ది. వీరితో పాటు ఈ కేసులో అభియోగా లు ఎదుర్కొంటున్న మరో 20 మందిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. దర్యాప్తు అధికారులు స్పష్టంగా ఆర్థిక నిరక్షరాస్యత కనిపిస్తోందని, వారు దాఖలుచేసిన చార్జిషీటుకు, సమర్పించిన ఆధారాలకు పొంతన లేదని మండిపడింది.

ఈ కేసుపై శుక్రవారం జస్టిస్ జితేంద్ర సింగ్ విచారణ చేపట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమర్పించిన సాక్ష్యాలు నేరాన్ని నిందితులు చేసిన నేరాన్ని నిరూపించలేకపోతున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. చార్జిషీట్‌కు సమర్పించిన ఆధారాలకు ఎలాంటి పొంతన లేదని మండిపడింది.

పక్కా ఆధారాలు లేకుండానే ఏకంగా ౨౩ మందిని చార్జిషీట్‌లో నిందితులుగా పేర్కొనడమేంటని నిలదీసింది. కేవలం రాజకీయ నేతలు, నాయ కులను ఇబ్బంది పెట్టేందుకే, వారిపై అభియోగాలు మోపినట్లు బయటపడు తోందని అభిప్రాయపడింది. ఈ కేసులో న్యాయస్థానం 23 మందిని డిశ్చార్జ్ చేయడంతో దర్యాప్తు సంస్థలకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. మరోవైపు, తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ, హైకోర్టును ఆశ్రయించింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

పార్టీ నేత మనీష్  సిసోడియాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తనపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తప్పుడు కేసులు పెట్టించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. దమ్ముంటే ఢిల్లీలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల్లో బీజేపీ ౧౦శాతం సీట్లు సాధించినా, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.

అవినీతి, నిరుద్యోగం, కాలుష్యం వంటి సమస్యలకు పరిష్కారాలు చూపి ప్రజల మనసు గెలిచి అధికారంలోకి రావాలే తప్ప, ఇలా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడం సరైన పద్ధతి కాదని కేజ్రీవాల్ హితవు పలికారు. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కూడా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి పార్టీ కాదని, తమపై బీజేపీ నేతలు తప్పుడు కేసులు మోపారని ఆమె ఆరోపించారు. 

సీబీఐ అధికారులపై చర్యలకు కోర్టు ఆదేశం

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించడమే కాకుండా, ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, కేవలం వినికిడి మాటల ఆధారంగా ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రాసిక్యూట్ చేయడంపై అసహనం వ్యక్తంచేశారు. దర్యాప్తు అధికారులు వాస్తవాలను పూర్తిగా బేఖాతరు చేశారని, ఇది దర్యాప్తు సంస్థల వ్యవస్థాగత విశ్వసనీయతను దెబ్బతీస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

అప్రూవర్లు ఇచ్చిన సాక్ష్యాలు తప్ప, ఈకేసులో మరే ఇతర భౌతిక ఆధారాలు లేవని, ఈ కేసులోకి ప్రభుత్వ అధికారులను సైతం లాగడం ఆందోళనకరమని విస్మయం వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారుల్లో స్పష్టంగా ఆర్థిక నిరక్షరాస్యత కనిపిస్తోందని మండిపడ్డారు. సమావేశాలకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేదా ఎలక్ట్రానిక్ ఆధారాలు లేవని తెలిపారు.

ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచం డిమాండ్ చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని వివరించారు. ఒక నిందితుడిని అప్రూవర్‌గా మార్చి, వారి ద్వారా దర్యాప్తును కొనసాగించడం సరికాదని, అది రాజ్యాంగ విలువల ఉల్లంఘన అని అభివర్ణించారు. దర్యాప్తు అధికారులు కావాలనే అభియోగాలు మోపారని, అందుకే ఈకేసులో వారిపై చర్యలు అవసరమని తేల్చిచెప్పింది. సదరు దర్యాప్తు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చారు. లిక్కర్ పాలసీ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు.

ప్రతి నిర్ణయానికి సంబంధించి ప్రతి అంశానికీ లిఖిత పూర్వక ఆధారాలు ఉన్నాయని, క్యాబినెట్ నిర్ణయాలు ఉన్నాయని తేల్చిచెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారన్న కారణంతోనే, ఆయన్ను నిందితుడిగా చేర్చారని, పాలసీకి సంబంధించిన ఏ సమావేశంలోనూ ఆయన పాల్గొన్నట్లు సాక్ష్యాలు లేవని స్పష్టం చేశారు. అలాగే మనీష్ సిసోడియా కూడా ఎలాంటి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదని కోర్టు తెలిపారు.

ఎవరిపై అయినా తీవ్రమైన నేరారోపణలు చేసేటప్పుడు అవి ఖచ్చితమైన ఆధారాలతో ఉండాలని, కేవలం ఊహలు లేదా కథనాల ఆధారంగా ఒక వ్యక్తిని ప్రధాన కుట్రదారుగా పేర్కొనడం సరికాదని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే, ఆ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుందన్నారు. 

హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ, సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు తన ఉత్తర్వుల్లో దర్యాప్తుకు సంబంధించిన అనేక కీలక అంశాలను విస్మరించిందని, సమర్పించిన ఆధారాలను సరైన రీతిలో పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది.

కేజ్రీవాల్ కంటతడి.. మీడియా ఎదుట భావోద్వేగం

లిక్కర్ పాలసీ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకున్నారు. తన కళ్లద్దాలు తీసి, కళ్లు తుడుచుకుంటూ ఉండిపోయారు. అప్పుడు పక్కనే ఉన్న మనీష్ సిసోడియా ఆయన్ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. తాను నిప్పులాంటి నిజాయితీపరుడిని న్యాయస్థానమే తేల్చిదంటూ హర్షం వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని బీజేపీ నేతలు తీవ్రంగా వేధించారు.. టీవీ ఛానళ్లలో చర్చలు పెట్టి మరీ కేజ్రీవాల్ అవినీతిపరుడని ప్రచారం చేశారు’ అంటూ వాపోయారు.

అవినీతి, నిరుద్యోగం, కాలుష్యం వంటి సమస్యలకు పరిష్కారాలు చూపి ప్రజల మనసు గెలిచి అధికారంలోకి రావాలే తప్ప, ఇలా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కూడా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి పార్టీ కాదని  పేర్కొన్నారు.

కేజ్రీవాల్ కంటతడి

లిక్కర్ కేసులో కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిన తర్వాత కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకున్నారు. అప్పుడు పక్కనే ఉన్న మనీష్ సిసోడియా ఆయన్ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ‘నేను నిప్పు లాంటి నిజాయతీపరుడినని న్యాయస్థానమే తేల్చింది. మమ్మల్ని బీజేపీ నేతలు తీవ్రంగా వేధించారు.. కేజ్రీవాల్ అవినీతిపరుడని ప్రచారం చేశారు’ అంటూ కేజ్రీ వాల్ వాపోయారు.

బీజేపీ 10 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం: కేజ్రీ సవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఉద్దేశిస్తూ బహిరంగ సవాల్ విసిరారు. ‘మీకు ధైర్యం ఉంటే ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించండి. ఆ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తమపై తప్పుడు కేసులు బనాయించడంతోనే పార్టీ ఓటమి చవి చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో మేం కేవలం ౨౨ స్థానాలే సాధించుకోగలిగామని గుర్తుచేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలవొచ్చు గానీ, ఆ పార్టీ ప్రజల మెప్పు పొందలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఢిల్లీ అభివృద్ధి కుంటుపడిందని అభిప్రాయపడ్డారు.

తమపై ఉన్న మచ్చ తొలగిపోయాయని, ఇక ప్రజలంతా తమ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాం కేసు స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర అని అభివర్ణించారు. కేసులో ఏమాత్రం వాస్తవాలున్నా, విచారణ సుమారు 15 ఏళ్లు సాగేదని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక దశలోనే వీగిపోయిందంటే, తాము నిర్దోషులమని తేలిపోయిందని పేర్కొన్నారు. తమ తరఫున న్యాయస్థానంలో సమర్థంగా వాదనలు వినిపించిన అడ్వొకేట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కేసు నుంచి బయటపడిన వారి వివరాలు

పేరు                 వారి రాష్ట్రం               హోదా లేదా రంగం 

అరవింద్ కేజ్రీవాల్         ఢిల్లీ                       మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్

మనీష్ సిసోడియా         ఢిల్లీ                                 మాజీ ఉప ముఖ్యమంత్రి

కల్వకుంట్ల కవిత       తెలంగాణ                  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

అభిషేక్ బోయినపల్లి ఏపీ                             వ్యాపారవేత్త

శరత్ చంద్రారెడ్డి          ఏపీ                               అరబిందో ఫార్మా డైరెక్టర్

మూత గౌతమ్                తెలంగాణ                         వ్యాపారవేత్త

అరుణ్ రామచంద్రన్ పిళ్లై తెలంగాణ            వ్యాపారవేత్త

బుచ్చిబాబు గోరంట్ల     తెలంగాణ             చార్టర్డ్ అకౌంటెంట్  (కవిత మాజీ సీఏ)

అమిత్ అరోరా                 హర్యానా                             బడ్డీ రిటైల్ డైరెక్టర్

రాజేష్ జోషి                 ఏపీ                               ఎల్ మీడియా అధినేత

దుర్గేష్ పాఠక్                   ఢిల్లీ                             ఆమ్ ఆద్మీ పార్టీ నేత

విజయ్ నాయర్      ఢిల్లీ                 ఆప్ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్‌చార్జి

కుల్దీప్ సింగ్              ఢిల్లీ                  ఎక్సైజ్ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్

నరేంద్ర సింగ్            ఢిల్లీ                        ఎక్సైజ్ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్

సమీర్ మహేంద్రు        ఢిల్లీ            ఇండో స్పిరిట్ సంస్థ యజమాని

అమన్ దీప్ సింగ్ ధల్ ఢిల్లీ                     బ్రాండిండ్ స్పిరిట్స్ డైరెక్టర్

వినోద్ చౌహాన్             ఢిల్లీ                            వ్యాపారవేత్త

చన్ప్రీత్ సింగ్ రాయత్ ఢిల్లీ                వ్యాపారవేత్త

అరవింద్ కుమార్ సింగ్ ఢిల్లీ                ప్రొడక్షన్ హౌస్ అధికారి

ప్రిన్స్ కుమార్             ఢిల్లీ              వ్యాపారవేత్త

దామోదర్ ప్రసాద్ శర్మ ఢిల్లీ            వ్యాపారవేత్త

అర్జున్ పాండే          ఢిల్లీ                 మీడియా సంస్థ ప్రతినిధి

ఆశిష్ చంద్ మాథుర్ ఢిల్లీ                 వ్యాపారవేత్త