మనలో నైపుణ్యత ఉంటేనే మంచి గుర్తింపు
ఆర్థికంగా ఎదగాలనే సంకల్పం అందరిలో ఉండాలి
మీరు నేర్చుకునే ప్రతి అక్షరం జీవితాన్ని సార్థకం చేస్తుంది
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): మనలో నైపుణ్యత ఉంటేనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బికే రెడ్డి కాలనీలో గల మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణా కేంద్రంలో నిర్వహించిన 5వ బ్యాచ్ నైపుణ్య శిక్షణ స్టడీ మెటీరియల్స్ ను శిక్షణ పొందిన మహిళలకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ శిక్షణా కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన కేంద్రంగా నిలుస్తోందని, దీనికి కారణం ఇక్కడ పనిచేస్తున్న నిర్వాహకులు, టీచర్లు, సిబ్బంది అందరి సమిష్టి కృషేనని అభినందించారు.
ఈ బ్యాచ్‌లో సుమారు 400 మంది మహిళలు,గృహిణులు, విద్యార్థులు,వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఎంఎస్ ఆఫీస్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కోర్సుల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ఇక్కడ ప్రాథమిక కోర్సులు నేర్చుకున్న తర్వాత టాస్క్ వంటి సంస్థలలో అడ్వాన్స్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు . కంప్యూటర్, లాంగ్వేజ్, డిజిటల్ స్కిల్స్, అకౌంటింగ్ (DCA, Tally వంటి) నేర్చుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
ఈ నైపుణ్యాలను ఉపయోగించి స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఉన్న గృహిణులు కూడా శిక్షణ పొందేలా పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ఈ సెంటర్ ప్రత్యేకతగా నిలిచిందని తెలిపారు. ఇది మహిళలకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌ల ద్వారా దాదాపు 2 వేల మంది మహిళలు శిక్షణ పొందారని, వారిలో చాలా మంది బ్యాంకు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి ద్వారా తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని చెప్పారు.
మహిళలు ఇంటి బయటకు వచ్చి ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కావాలని, తమపై నమ్మకం పెంచుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇది ముగింపు కాదని, ఒక కొత్త ప్రారంభమని, ఈ మూడు నెలల కోర్సు తర్వాత కూడా అడ్వాన్స్ స్థాయికి చేరేందుకు కృషి చేయాలని సూచించారు. త్వరలోనే వీరన్నపేట ప్రాంతంలో మరో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ కేంద్రం రాబోయే 2,3 నెలల్లో పూర్తి చేసి అక్కడ కూడా మహిళలకు శిక్షణ అందించే కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. మహిళా శక్తిని ప్రోత్సహిస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఇంచార్జీ నిజలింగప్ప, సెట్విన్ సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






