2 July, 2026 | 4:35 AM

అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో ఉండాలి

02-07-2026 02:21 AM

అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర రెడ్డి

కూసుమంచి, జూలై 1 (విజయక్రాంతి): అర్హులైన ప్రతిఒక్కరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను అదనపు సీఈవో, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. ఈ. శ్రీజతో కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.

బుధవారం కూసుమంచి మండలం జుజ్జుల్ రావుపేట, కొనిజర్ల మండలం తనికెళ్ళ, వైరా మండలం కేజీ సిరిపురం గ్రామాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ సరళిని అదనపు సిఇఓ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అదనపు సీఈవో, బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), సూపర్వైజర్ల పనితీరును పరిశీలించారు.

ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల సేకరణ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ధ్రువీకరణ ప్రక్రియ, అవసరమైన పత్రాల పరిశీలన తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, దోషరహితంగా రూపొందించడమే లక్ష్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అర్హుడైన ఓటరును జాబితాలో నమోదు చేయడంతో పాటు, మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, డూప్లికేట్ నమోదులను నిబంధనల ప్రకారం తొలగించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి, ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలని, ఫారాల నింపడంలో సహకరించాలని అదనపు సిఇఓ అన్నారు.

బీఎల్వోలు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఓటరు జాబితా నాణ్యతను మెరుగుపరచడంలో ఎస్‌ఐఆర్ కీలకమని, ఈ ప్రక్రియను సమయపాలనతో పూర్తి చేయాలని అన్నారు. అదనపు సిఇఓ తనిఖీ సందర్భంగా మండల తహశీల్దార్లు, బిఎల్‌ఓలు, అధికారులు, తదితరులు ఉన్నారు.