19-02-2026 01:26:34 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : ఈఎస్‌ఐ అంటే మొదటినుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చిన్నచూపే. కొద్దికాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ (ఈఎస్‌ఐ) డిస్పెన్సరీలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చుతూ తీసుకున్న నిర్ణయం లబ్ధిదారుల్లో తీవ్ర ఆందోళన, ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదనను కల్గిస్తోంది.
లబ్ధిదారులకు డిస్పెన్సరీలను కనుగొనలేని ప్రాంతాలకు తరలించడానికి ఉత్తర్వులు జారీచేయడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న సుమారు 15 లక్షల మంది లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే సుమారు 60 నుంచి 75 లక్షల మందికి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా డిస్పెన్సరీకి వెళ్లా లంటే నరకప్రాయంగా మారే పరిస్థితి తలెత్తింది.
స్థలం మార్చేందుకు నిర్ణయం..
వాస్తవానికి ఈఎస్‌ఐ ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వంలోని కార్మిక శాఖనే నేరుగా డిస్పెన్సరీలను నడిపించేంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 70కిపైగా డిస్పెన్సరీల అద్దెలుకూడా చెల్లించేది. అయితే ఈఎస్‌ఐ బాధ్యతల నుంచి మెల్లగా తప్పుకునే నేపంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 500 కోట్ల నిధులను మంజూరు చేసేది. ఇందులో నుంచి డిస్పెన్సరీల అద్దెలు, ఉద్యోగుల జీతభత్యాలు, మందులు ఇతర సామగ్రి కొనుగోలుకు ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించేది.
ఆపై కేంద్రం తమ నిధుల్లో కోత పెట్టింది. ఏటా రూ. 250 కోట్లు మాత్రమే ఇస్తూ వస్తోంది. అద్దెలు, ఇతర సామగ్రి తామే కొనుగోలు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్‌ఐ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించాలని చెప్పింది. అటుపై కేంద్రం మరో అడుగు వేసి.. చాలా డిస్పెన్సరీలను కేంద్ర ప్రభుత్వ కార్యాలయ భవనాల్లోకి తరలించింది.
అందులో భాగంగానే సనత్‌నగర్ డిస్పెన్సరీ 1, 2లను అమీర్‌పేటలోని బీఎస్‌ఎన్‌ఎల్ భవనంలోకి తరలించింది. అయితే తాజాగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుని.. అద్దెలు మీరే చెల్లించండి, మీ రాష్ట్ర ప్రభుత్వ భవనాల్లోకి తరలించండంటూ కేంద్రం నుంచి లేఖ వచ్చింది. ఈ లేఖ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 29 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను రాష్ట్ర ప్రభుత్వ భవనాల్లోకి మార్చుతూ ఉత్తర్వులు జారీచేశారు.
అడ్డదిడ్డంగా.. ఇష్టారాజ్యంగా..
ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు అనేవి వాస్తవానికి లబ్ధిదారులు (ఈఎస్‌ఐ కార్డుదారులు) ఎక్కువగా నివసించే, పనిచేసే ప్రాంతంలోనే ఆయా ప్రాంతాల పేర్లతో ఏర్పాటుచేశారు. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం మేరకు వాటిని ఇతర చోట్లకు తరలించారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఖైరతాబాద్‌లో ఉన్న అమీర్‌పేట్ డిస్పెన్సరీని కోఠిలోని బడీచౌడీకి మార్చారు.
అలాగే ఖైరతాబాద్‌లోని ఖైరతాబాద్ డిస్పెన్సరీనికూడా అక్కడికే (జీహెచ్‌ఎంసీ కమర్షియల్ కాంప్లెక్స్) మార్చారు. చిన్న చిన్న సం స్థలు, షాపులు, దుకాణాలలో పనిచేసుకునే ఈఎస్‌ఐ లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేయాల్సిన డిస్పె న్సరీలను సిటీలో ఎక్కడికో మార్చారు. ఐడీఏ బొల్లారం డిస్పెన్సరీని ప్రగతినగర్‌లోని బస్తీదవాఖానకు మార్చారు. మేడ్చల్ ఈఎస్‌ఐ డిస్పెన్సరీని గుండ్లపోచంపల్లి పరిధిలోని గౌడవెల్లి వార్డ్ కార్యాలయంలోకి మార్చారు.
విద్యానగర్ డిస్పెన్సరీని అడికిమెట్ కమ్యూనిటీ హాల్‌కు మార్చారు. ఇలా మొత్తం 29 డిస్పెన్సరీలను మార్చడంతో.. వీటి పరిధిలో ఉండే లబ్ధిదారు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి కనపడుతోంది. అలాగే ఇందులో పనిచేసే ఉద్యోగులు రోజూ ఇరుకు గదుల్లో అరకొర వసతుల మధ్య.. దుమ్ము, ధూళి, ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కమ్యూనిటీ హాళ్లు.. బస్తీ దవాఖానాల్లో ఎలా..
జీహెచ్‌ఎంసీ పరిధిలో చాలా డిస్పెన్సరీలను ఇతర ప్రాం తాల్లో ఖాళీగా ఉన్న కమ్యూనిటీ హాళ్లకు మార్చారు. వాస్తవానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిటీ హాళ్లు.. అక్కడి ప్రజల సామూహిక అవసరాలు, కుటుంబంలో పండుగలు నిర్వహించుకోవడానికి, సమావేశాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు రావడంతో ఇకపై ఇలాంటి అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ప్రైవేటు ఫంక్షన్‌హాళ్ళను, స్థలాలను వెతుక్కోవాల్సిందే.
పైగా అనేక చోట్ల కమ్యూనిటీ హాళ్లలో పోలింగు బూత్‌లుకూడా ఉన్నాయి. మరి ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు కేటాయిస్తే.. వివిధ ఎన్నికలకు పోలింగ్‌బూత్‌గా ఎలా ఉపయోగించుకోగలరో ప్రభుత్వానికే తెలియాలి. అలాగే బస్తీ దవాఖానలు చాలా చిన్నగా ఉన్నా యి. ఇప్పుడు అక్కడికి ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు తరలిస్తే.. అసలు ఆయా భవనాలు సరిపోవు.
ఎందుకంటే ఈఎస్‌ఐ డిస్పెన్సరీలలో కన్సల్టెంట్, ఓపీ, ల్యాబ్, ఫార్మసీ, గోదాం లాంటి 8 నుం చి 10 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో డిస్పెన్సరీకి సుమారు 10 నుంచి 15 లారీల నిండా అయ్యేంత సామాగ్రి, పరికరాలు ఉం టాయి. వీటన్నింటినీ ఎక్కడ, ఎలా పెట్టాలో అధికారులకు.. అందులో పనిచేసే ఉద్యోగులకే తెలియాలి.
అక్షాంశాలు.. రేఖాంశాలే దిక్కా..
ప్రస్తుతం తరలించాల్సిన చాలా భవనాలను సామాన్య ప్రజలు గుర్తించలేనివిగా ఉన్నాయి. అధికారులకుకూడా అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. కొన్ని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను తరలించాల్సిన (రాష్ట్ర ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు) ప్రాంతాలను గుర్తించేందుకు ఉత్తర్వుల్లోనే అక్షాంశాలు, రేఖాంశాలను పొందుపర్చారు. ఖైరతాబాద్, అమీర్‌పేట డిస్పె న్సరీలను కోఠీలోని బడీచౌడిలో ఉండే జీహెచ్‌ఎంసీ కమర్షియల్ కాంప్లెక్స్‌లోకి మార్చాలని ఆదేశాలిచ్చారు. అందులో కచ్చితంగా ఎక్కడ అనేది తెలియాలంటే.. అక్షాంశాలు, రేఖాంశాల సాయంతో వెళ్లాల్సిందే.
మరి ఈఎస్‌ఐ లబ్ధిదారులు ఇక్కడికి వెళ్లాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో అనేది ఆ దేవుడికే తెలియాలి. చిరుద్యోగులు, చిన్నపాటి గుమాస్తాలుగా పనిచేసేవారు, చిరువ్యాపారాల్లో ఉండేవారు.. ఇంతటి సాంకేతిక ఆధారంగా ఈఎస్‌ఐ డిస్పెన్సరీని కనుక్కోవడం అనేది నమ్మశక్యం కానిదే. ఇక మహిళలు, వృద్ధులు అయితే అంత దూరం వెళ్లడం ఒక ఎత్తయితే.. సదరు భవనాన్ని కనుక్కోవడం మరో ఎత్తు. ఎందుకులే ఇదంత బాధ అనుకుంటూ.. ప్రైవేటు వైపు మళ్లాల్సిందేనని లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు.