20 August, 2026 | 3:32 AM

నర్సంపేటకు వెళ్తుండగా ఎర్రబెల్లి దయాకర్ అరెస్ట్

20-08-2026 12:00 AM

జనగామ, ఆగస్టు19 (విజయక్రాంతి) :  నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత ఘటనపై పరామర్శకు వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును జనగామ  పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల మరణించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ, ఆవిష్కరణ కోసం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా గద్దె నిర్మించారు. అనుమతులు లేవంటూ  మున్సిపల్ అధికారులు ఆ గద్దెను జేసీబీతో కూల్చివేశారు.

ఈ ఘటనతో నర్సంపేటలో రాజకీయ దుమారం రేగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు, ఘటనాస్థలిని పరిశీలించేందుకు బయలుదేరిన ఎర్రబెల్లి దయాకర్ను బుధవారం రోజున జనగామ ప్రాంతంలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అరెస్ట్ సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు  రోడ్లపైకి వచ్చి ధర్నా చేపట్టారు. ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. ‘ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్య. ఒక ప్రజా నాయకుడి విగ్రహ గద్దెను ఇలా కూల్చివేయడం దుర్మార్గం. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా రాత్రివేళ కూల్చడం ఏమిటి?‘ అని మండిపడ్డారు.