05-02-2026 12:00:00 AM
భద్రాచలం, ఫిబ్రవరి 4, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో జీవించే ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు, సమాజంలో వెనుకబడిన ఆఖరి వ్యక్తికి కూడా తగిన వనరులు ప్రాతినిథ్యం, ఆత్మగౌరవం కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. బుధవారం ఐటిడిఏలో యూనిట్ అధికారుల సమక్షంలో మహనీయుల చిత్రపటాలకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన, అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి,రాజకీయ కులాల సర్వేతో పాటు షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ పేద ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా పాటుపడుతుందన్నారు.
ఈ హక్కులు సాధించడానికి తమ జీవితాలను ధారపోసిన మహనీయుల మనకు మార్గదర్శకాలని, అందరి అభ్యున్నతయే లక్ష్యంగా మహాత్మా గాంధీ కలగన్న సర్వోదయ నుంచి అణగారిన వర్గాలకు విద్యా ,గౌరవం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటం అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బోధించిన సామాజిక ప్రజాస్వామ్య విలువల వరకు మనందరికీ నిరంతర ప్రేరణ అన్నారు.
ప్రగతి అనేది ఒక గమ్యం కాదని అది నిరంతర సామాజిక న్యాయ పోరాటమని, ప్రతిభకు అవకాశాలు తోడైనప్పుడు కుల మతాల భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తమ కలలను సహకారం చేసుకునే సమాజాన్ని మనం నిర్మించాలని, భారతదేశ అభివృద్ధిలో ప్రతి పౌరులు భాగస్వామి అయ్యేలా సమ్మిళిత భారతావని కోసం మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఆయన అన్నారు. అనంతరం ఐటిడిఏ యూనిట్ అధికారులు సిబ్బందితో కలిసి సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఏపీఓ పవర్ వేణు, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, పీవీటీజీ అధికారి గన్యా, ఏసీఎంవో రమేష్, ఏవో సున్నం రాంబాబు, డి టి ఎల్ టి ఆర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.