వాహన దొంగతనాల కేసులో నిందితుడి అరెస్ట్
- నాలుగు వాహనాలు స్వాధీనం
సిద్దిపేట క్రైం: ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తి వరుస వాహన దొంగతనాలకు పాల్పడుతూ చిన్నకోడూరు పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన జొన్నల సాయికుమార్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా జీవనోపాధి పొందుతున్నాడు. ఆటో నడిపితే వచ్చే ఆదాయం సరిపోకపోవడం, మద్యం తాగడం వ్యసనంగా మారడంతో వాహనాల దొంగతనాలకు అలవాటు పడ్డాడు.
ఈ క్రమంలో సిద్ధిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాలలో రాత్రి వేళల్లో నిర్లక్ష్యంగా పార్క్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డాడు. చిన్నకోడూరు పోలీసులు రామునిపట్ల గ్రామ సమీపంలో సాయికుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించగా, పలు వాహన దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. వెల్దుర్తి గ్రామంలోని అతని నివాసం వెనుక భాగంలో దాచిపెట్టిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.






