తగాదా నేపథ్యంతో జానపాటి శారద ఆత్మహత్య
ఇద్దరిపై కేసు నమోదు
కల్లూరు,(విజయక్రాంతి): మండలంలోని రఘునాథగూడెం గ్రామంలో కుటుంబ తగాదా విషాదాంతానికి దారితీసిన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన జానపాటి శారద (45), ఆశా కార్యకర్త,తన తోటి కోడలు జానపాటి ద్వారక,మరిది జానపాటి భాస్కరరావుతో జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. పోలీసుల వివరాల ప్రకారం... తగాదా సమయంలో ద్వారక, భాస్కరరావు కలిసి శారదను అసభ్య పదజాలంతో దూషించి, దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనతో అవమానంగా భావించిన శారద తీవ్ర మనస్తాపానికి గురై పారాసెటమాల్ మాత్రలు, మెట్ ఫార్మిన్ మోతాదుకు మించి తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది.కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.ఈ ఘటనపై మృతురాలి భర్త జానపాటి రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానపాటి భాస్కరరావు,జానపాటి ద్వారకాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.






