ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం
ఈఎస్‌ఈటీఎల్‌తో ఒప్పందం సంతోషకరం
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నియోజలవర్గాల అభివృద్ధి సాధ్యం అవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సచివాలయం, ఈక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ మధ్య కానిస్టిట్యూషన్ డెవలప్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్‌పై అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, కౌన్సిల్ సెక్రటరీ డా. వీ నరసింహా చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, ఈక్విప్ డైరెక్టర్ వింద్యా ధర్మరాజు, ఫౌండర్ లక్ష్మీనారాయణ, ఐ ల్యాబ్స్ చైర్మన్ శ్రీనిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని 119 నియోజకవర్గాల్లో ప్రజల సంక్షేమం కోసం సరికొత్తగా ఈక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదరడం శుభపరిణామన్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని కోరారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగం, పౌర సమాజం, విద్యా సంస్థలు, దాతలు, ఎన్జీవోలు, సీఎస్‌ఆర్ నిధులను సమీకరించి వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మకమైన ఫలితాలను సాధించవచ్చన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని చెప్పారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా అభివృద్ధికి ఒక వేదికగా ఈక్విప్ సంస్థ నూతన ఆలోచనతో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఉపాధి అవకాశాల సృష్టి, ఆర్థిక స్థిరత్వం, నియోజకవర్గాల వారీ రూట్‌మ్యాప్ పై పనిచేయడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు.






