20 May, 2026 | 4:52 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

20-05-2026 12:11 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

నూతనకల్, మే 19: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని ఎర్రబాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తేమ శాతాన్ని తనిఖీ చేసి వెంటనే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు.

కేంద్రాల్లో గన్ని బ్యాగులు, లారీలు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు పూర్తి చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేసి, రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలలో రైతులకు తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.ఈ పరిశీలన కార్యక్రమంలో కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాసరావు, ఏపీఎం ఝాన్సీ, ఆర్ ఐ హసన్, పాల్గొన్నారు.