దాబాలపై ఎక్సైజ్ ఉక్కుపాదం
అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు: ఎక్సైజ్ ఎస్‌ఐ దామోదర్
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, దాబాలు - రెస్టారెంట్లలో మద్యం అందుబాటులో ఉంచుతూ సేవించే అవకాశం కల్పిస్తున్న వారిపై ఎక్సైజ్ అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రాజేష్ దాబా, మారుతీ దాబా నిర్వాహకులు అనుమతి లేకుండా మద్యం సేవించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా పట్టణంలోని ఇతర దాబా నిర్వాహకులకు కూడా మద్యం విక్రయించరాదని, ప్రాంగణంలో మద్యం సేవించేందుకు అనుమతించరాదని హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హుస్నాబాద్ ఎక్సైజ్ ఎస్‌ఐ దామోదర్ హెచ్చరించారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుళ్లు భాస్కర్, రేణుక పాల్గొన్నారు.






