7 August, 2026 | 10:58 AM

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రక్షణ

07-08-2026 09:48 AM

- అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.తరణి

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి) :  ఎస్సీ, ఎస్టీ ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి రాజ్యాంగం ప్రత్యేక రక్షణ కల్పించిందని ఒకటో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.తరణి తెలిపారు.  రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, న్యాయసేవాధికార సంస్థ జిల్లా చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ ఆదేశానుశారం 'గిరిజన హక్కుల పరిరక్షణ,  అమలు పథకం-2015' అనే అంశంపై  సిద్దిపేట కేసీఆర్ నగర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి వి.తరణి హాజరై మాట్లాడారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో న్యాయం, సమానత్వం, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యను ఆయుధంగా చేసుకొని తమ వ్యక్తిగత అభివృద్ధితోపాటు సమాజ అభివృద్ధికి కూడా కృషి చేయాలని సూచించారు. చదువుకు దూరంగా ఉన్న పిల్లలను పాఠశాలలో చేరేలా  ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రమేష్ బాబు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ రవి కుమార్, సిద్దిపేట వన్ టౌన్ సీఐ మురళి, పాఠశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్ సాజిద్, ఉపాధ్యాయులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.