7 May, 2026 | 1:25 AM

లోడింగ్ ఆలస్యం.. రోడ్డెక్కిన రైతులు

07-05-2026 12:29 AM

భిక్కనూర్, మే 6 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు అనంతరం వారం రోజులకుపైగా గడిచినా లోడింగ్ చేపట్టకపోవడంతో రైతుల ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో సోమవారం రైతులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. కాంటా పూర్తయిన ధాన్యం బస్తాలు కల్లాల్లోనే పేరుకుపోయి ఉండగా, లారీల కొరత కారణంగా లోడింగ్ ఆలస్యమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 6 వేలకుపైగా ధాన్యం బస్తాలు ఇంకా తరలింపుకు నోచుకోలేదని తెలిపారు.

వారం, పది రోజులు గడిచినా అధికారులు స్పందించకపోవడంతో కాచాపూర్‌దోమకొండ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఇంకెన్ని రోజులు ఇలా వేచి చూడాలి? మా పరిస్థితి ఏమిటి? అంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యం లోడింగ్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.