07-02-2026 12:22:32 AM
చర్ల /కామారెడ్డి /రాయ్‌పూర్ /ముంబై: ఛత్తీస్‌గఢ్ -మహారాష్ట్ర సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత ప్రభాకర్ అలియాస్ లోకేటి చందర్‌రావు సహా ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృ తుల్లో నలుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మరోవైపు.. ఇవే కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం పొందాడు.
మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని గడ్చిరోలీ అబూజ్‌మడ్ ప్రాంతంలో మావో యిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో ఈ నెల ౩న మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలోకి భారీగా 14 సీ-60 కమాండో బృందాలు మోహరింపజేశారు. బలగాలు కూంబింగ్ చేస్తుండగా గురువారం రాత్రి వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రా రంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు.
మరుసటి రోజు శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగింది. బలగాల ధాటికి తాళలేక మావోయిస్టులు దట్టమైన అటవీప్రాంతంలోకి పరారయ్యారు. జవాన్లు అనంతరం ఆ ప్రాం తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మరోవైపు ఇవే ఎదురుకాల్పుల్లో సీ-60 కమాండో దీపక్ చిన్న మాడ్వి (38) తీవ్రంగా గాయపడి మృతిచెందారు. దీపక్ అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది.
కాల్పుల్లో మరో జవాన్ జోగా మాడ్వి గాయపడి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జవాన్లు ఘటనా స్థలంలో మూడు ఏకే- రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక 303 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ మినహా మిగిలిన మృతుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో మావోయిస్టులకు చెందిన కంపెనీ తీవ్రంగా దెబ్బతిన్నట్లు పోలీస్ అధికారులు భావిస్తున్నారు.
బీజాపూర్‌లో ఒక మావోయిస్టు మృతి
బీజాపూర్ జిల్లాలో శుక్రవారం మరో ఎనకౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఉద్ధమ్‌సింగ్ మృతిచెందాడు. ఆయన తలపై రూ.8 లక్షల రూపాయల రివార్డు ఉంది. డీఆర్జీ, కోబ్రా బలగాలు సం యుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఘటనా స్థలం లో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 23 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు.
మావోయిస్టు పార్టీలో ప్రభాకర్‌ది 40 ఏళ్ల ప్రస్థానం
మావోయిస్టు నేత ప్రభాకర్ అలియాస్ లోకేటి చందర్ రావు స్వస్థలం ఆయన స్వస్థలం తెలంగాణంలోని కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. చిన్నతనంలో ఆయన మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితుడై అడవిబాట పట్టాడు. ఒక సాధారణ సభ్యుడిగా పార్టీలో క్రమంగా అగ్రనేతగా ఎదిగాడు. 40 ఏళ్ల నుంచి మావోయిస్టు పార్టీలోనే ఉన్నారు. ఆయన భార్య కూడా మావోయిస్టు ఉద్యమంలోనే ఉండగా, కొన్నేళ్ల క్రితం ఆమె అనారోగ్యంతో మృతిచెందింది.
వారికి ఒక కుమారుడు. కొన్నాళ్ల క్రితం కుమారుడు పోలీసులకు లొంగిపోయాడు. అయినప్పటికీ.. ప్రభాకర్ మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతున్నాడు. గతంలో ఆయన ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలోని పడకల్, చద్మల్‌లో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు.
ఆయన ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ గడ్చిరోలి డివిజన్ కమిటీ చీఫ్‌గా, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సభ్యుడిగా, కంపెనీ నంబర్ 10 బెటాలియన్ బాధ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇవాళో రేపో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోతాడని భావించిన తరుణంలో ఆయన ఎన్‌కౌంటర్ కుటుంబ సభ్యులకు షాక్‌నిచ్చింది. ఆయన తలపై రూ.౫౦ లక్షల రివార్డు ఉంది. ప్రభాకర్ మృతిని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ధ్రువీకరించారు.