ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): ఆర్థిక స్థోమత లేని కారణంగా హామీ పత్రం, డబ్బులు చెల్లించలేని విచారణ ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం జిల్లా స్థాయి సాధికార కమిటీ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ హాజరయ్యారు.
మిగిలిన కమిటి సభ్యులలో జిల్లా ఎస్పీ డి.సునీత, వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజనీ తమ తమ కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.మంగళవారం విచారణలో చిన్న నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలకు బెయిలు లభించినప్పటికి ఆర్థిక స్తోమత లేని కారణంగా హామీ పత్రం ఇవ్వలేని ముగ్గురు ఖైదీలపై జిల్లా స్థాయి కమిటిలో చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆర్థిక స్థోమత లేని కారణంగా హామీ పత్రం, డబ్బులు చెల్లించలేని విచారణ ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశమని తెలిపారు. సాధికార కమిటి ద్వారా ఎవరికైతే హామీ పత్రం డబ్బులు మాఫీ చేసి జైలు నుండి విడుదలకు అనుమతించడం జరుగుతుందో.. అలాంటి వారిని విడుదలకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిటీ సమావేశంలో ముగ్గురు ఖైదీలకు బెయిల్ కు కమిటీ సిఫారసు చేయడం జరిగిందన్నారు.




