ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): జన గణన (సెన్సస్) విధుల్లో పాల్గొనే సిబ్బంది ప్రతి ఒక్కరూ ఖచ్చితత్వంతో, బాధ్యతతో తమ విధుల్ని నిర్వహించి ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జనగణన ప్రక్రియలో పాల్గొనే టెక్నికల్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... దేశ భవిష్యత్తు, అభివృద్ధికి జనగణన ప్రక్రియ అత్యంత కీలకమని తెలిపారు.
టెక్నికల్ అసిస్టెంట్లు ఈ శిక్షణను సీరియస్ గా తీసుకుని అన్ని అంశాలను నేర్చుకోవాలని సూచించారు. ప్రతి టెక్నికల్ అసిస్టెంట్ హౌస్ లిస్టింగ్, కుటుంబాల గుర్తింపు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. గృహ లిస్టింగ్ ప్రక్రియ మే 11 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అందరూ ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించారు.
జనగణన ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం పై పట్టుదలతో అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. జనగణన పనులను ఖచ్చితత్వంతో, బాధ్యతతో నిర్వహించి ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో సిపిఓ హరికృష్ణ, ఉపాధి కల్పనాధికారిని ప్రియాంక, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు




