24 March, 2026 | 9:29 PM

జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి

24-03-2026 07:51 PM

జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ

గద్వాల: జన గణన 2027ను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అధికారులను అదేశించారు. అన్నారు. మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో 2027 జనాభా లెక్కల ప్రక్రియపై నిర్వహించిన తొలి రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా గణన- 2027 నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన పెంపొందించుకుని పక్కాగా జరిగేలా చూడాలని  అధికారులను ఆదేశించారు.

జనాభా గణన–2027లో ఒక్కరినీ వదలకుండా, ఎలాంటి డూప్లికేషన్ లేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న జనాభా నిజమైన వివరాలతో ప్రతిబింబించాలని పేర్కొన్నారు. జన గణనలో పాల్గొనే అధికారులకు మూడు రోజుల పాటు శిక్షణ కొనసాగనుందన్నారు. సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ, డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రతి వ్యక్తి,నివాస గృహాలు, కట్టడాలు, కుటుంబాల తదితర వివరాలను అధికారులు పక్కాగా సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు.

జన గణన ప్రక్రియ సజావుగా సాగితేనే ఆయా వర్గాల ప్రజలకు భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. జన గణనలో పాల్గొని అధికారులు బాధ్యతాయుతంగా తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అధికారులు‌కు పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా ప్రక్రియను వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ సుల్తాన్ అలీ, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు