వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
ఉట్నూర్,(విజయక్రాంతి): ఐటిడిఎ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బిఎం సంతోష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాదులో డైరెక్టర్ ను కలిసి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఉట్నూర్ యువజన శిక్షణ కేంద్రం (YTC) ఆధునీకరణ (Upgradation), గిరిజన యువతకు మెరుగైన నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, వసతి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలను
, గోండి భాష పరిరక్షణ, ప్రోత్సాహం డిజిటల్ వినియోగాన్ని విస్తరించేందుకు రూపొందించిన గోండి అప్లికేషన్ ప్రాజెక్టు ఆమోదం (Ratification) అంశంపై చర్చించి, ప్రాజెక్టును త్వరితగతిన అమలు చేసేందుకు అవసరమైన చర్యలను వివరించారు. గిరిజనుల జీవనోపాధి అభివృద్ధి దిశగా మహువా (ఇప్ప) ఉత్పత్తుల సరఫరా గొలుసు (Mahua Supply Chain) ప్రాజెక్టు ప్రారంభంపై కూడా చర్చ జరిగింది. మహువా సేకరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ మరియు గిరిజన మహిళల ఆదాయ వృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ప్రాజెక్టు అధికారి వివరించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (DTDO) పోస్టులను భర్తీ చేసి అధికారులను నియమించినందుకు డైరెక్టర్ గారికి ప్రాజెక్టు అధికారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల సంక్షేమం, ఉపాధి మరియు జీవనోపాధి అభివృద్ధికి సంబంధించిన పీఎం జుగా (PM - JUGA) పథకం ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు కూడా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలకు గిరిజన సంక్షేమ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని డైరెక్టర్ బి. ఎం. సంతోష్, ఐఏఎస్ గారు హామీ ఇచ్చినట్లు ప్రాజెక్టు అధికారి తెలిపారు.






