ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
* తహసీల్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన
మంగపేట,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) ఇచ్చిన పిలుపులో భాగంగా ములుగు జిల్లా మంగపేట మండల రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది శుక్రవారం మంగపేట తహసీల్దార్ తోట రవీందర్ కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈజేఏసీ ప్రకటించిన కార్యచరణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మంగపేట తతహసీల్ కార్యాలయంలో మండల తహసీల్దార్ తోట రవీందర్ కు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం టీజీఈ జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని, హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి.
పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఎల సమస్యలను పరిష్కరించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నినాదాలిచ్చారు.






