23 May, 2026 | 2:41 AM

నిప్పుల కుంపటి

23-05-2026 12:00 AM

ముత్తరాం లో అత్యధికంగా 46.5 

కరీంనగర్,మే22(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. గత ఏడాది కంటే ఈ ఏడాది భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ముత్తరంలో శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఐయ్యింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

గురువారం పెద్దపల్లి జిల్లాలో

 46.1, శుక్రవారం 46.5 డిగ్రీలు, కరీంనగర్ జిల్లాలో గురువారం 45, శుక్రవారం గంగాధర లో 46.4, జగిత్యాలలో గుతువారం 45.1, శుక్రవారం జిల్లాలోని ధర్మపురిలో 46.4 రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం 43.5, శుక్రవారం వేములవాడ రూరల్ లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఉదయం ఏడు గంటలకే సూర్యుడు సురసురమం టున్నాడు. ఉదయం పది గంటల కు రహదారులు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప జనం ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు.

నిత్యం కొనుగోలు దారులతో రద్దీగా ఉండే కరీంనగర్, జగిత్యాలబెటవర్ సర్కిళ్ళు, సిరిసిల్ల చౌరస్తా, గోదావరిఖని లక్ష్మీనగర్, డాక్టర్స్ స్ట్రీట్ లలో వ్యాపార సంస్థలు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. రామగుండం ఉపరితల గనులలో 3 నుంచి 5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అదనంగా నమోదవుతున్నాయి. దీంతో ఉపరితల గనుల్లో ఉదయం రెండో షిప్టులలో కార్మికుల హాజరుశాతం తగ్గుతుంది. ఓసీపీ గనుల్లో 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.ఈనెల 25 నుంచి రోహిణికార్తె ప్రారంభం కానుంది. వారం రోజులు జనం ఇండ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

ఏసి అమ్మకాల జోరు

ఎండల తీవ్రత, ఉక్కపోత విపరీతంగా పెరగడం వల్ల ఎయిర్ కండిషనర్ అమ్మకాలు మే నెలలో రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏసీ అమ్మకాలు పెరగడానికి కారణాలు అసహ్యకరమైన వేడి ఉమ్మడి జలాల్లో లో గత కొన్ని సంవత్సరాలుగా వేసవి తీవ్రత, వడగాలులు పెరిగిపోయాయి. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా ఏసీ అనేది అత్యవసరంగా మారింది. మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడం, కొత్త గృహ నిర్మాణాలు పెరగడంతో చాలామంది తొలిసారిగా ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఫైనాన్స్ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో దాదాపు 70 శాతం మంది వినియోగదారులు ’బై నౌ - పే లేటర్’ మరియు ఈఎంఐ పద్ధతుల ద్వారా ఏసీలను కొనుగోలు చేస్తున్నారు.