పర్యావరణానికి సవాలుగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు
ఘట్ కేసర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం ఘట్ కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ అన్నోజిగూడ లోని ఎస్టీ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన ఈ-వేస్ట్ మెగా డ్రైవ్ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఎ.వాణి పాల్గొన్నారు.
ఈసందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ... సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెద్ద సవాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాడైపోయిన సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా, శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేయడమే ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈమెగా డ్రైవ్‌లో 'యువ ఎకో మేనేజ్మెంట్' సంస్థ ప్రతినిధులు పాల్గొని, సేకరించిన వ్యర్థాలను సురక్షితంగా తరలించే బాధ్యతను తీసుకున్నారు.
అన్నోజిగూడ పరిసర ప్రాంత ప్రజలు, మహిళా సంఘాల ఆర్.పి లు ఉత్సాహంగా పాల్గొని తమ ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను అందజేశారు. ఈ-వేస్ట్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో పౌరులందరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని డిప్యూటీ కమిషనర్ వాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.




