10 April, 2026 | 4:49 AM

విద్యుత్ కార్మికుల సమ్మె ఉధృతం

10-04-2026 01:02 AM
  1. సైనిక్‌పురి డివిజన్ కార్యాలయం వద్ద వినూత్న నిరసన, అమ్మవారికి బోనాలు, వనభోజనాలు

రెండవ రోజుకు చేరిన విద్యుత్ కార్మికుల ఆందోళన

కుషాయిగూడ, ఏప్రిల్ 9: (విజయక్రాంతి) : తమ న్యాయమైన డిమాండ్ల పరి ష్కారం కోసం దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ఆర్టిసన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరింది. గురువారం సైనిక్పురి డివిజన్ కార్యాలయ ఆవరణలోని నల్ల పోచమ్మ దేవాలయం వద్ద కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, అక్కడే వనభోజనాలు చేస్తూ తమ ఐక్యతను చాటారు.

డివిజన్ పరిధిలోని అన్ని సెక్షన్ల నుండి తరలివచ్చిన ఆర్టిసన్ కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ పరిసరాలను హోరెత్తించారు. సంస్థను నమ్ముకుని రాత్రింబవళ్లు శ్రమిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం బేఖాతరు చేయడంపై నాయకులు మండిపడ్డారు. యాజమాన్యం తమ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృత రూపం దాలుస్తుందని హెచ్చరించారు. డిమాండ్లు నెరవేరే వరకు విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ సర్కిల్ జాక్ చైర్మన్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు సంఘటితమయ్యారు.

కార్యక్రమంలో క్రిస్టోఫర్, జానయ్య, మల్లారెడ్డి, పైసా రవి, మోహన్ రావు, జానీ, ప్రసాద్, జమాల్, నరేష్ గౌడ్, విజయ్, కృష్ణ, రమేష్, రాజు, వెంకటేష్, దేవకుమార్, మహిళా  సుగుణ, లక్ష్మి, మమత, విజయ తదితరులు బోనాలతో నిరసనలో పాలుపంచుకున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.