బహదూర్‌గూడలో తీవ్ర ఉద్రిక్తత
బుల్లెట్ ట్రైన్ భూసేకరణపై రైతుల ధిక్కారం..
తోపులాటలో స్పృహతప్పిన రైతు
ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ రైతుల డిమాండ్
రంగారెడ్డి,జూలై 18(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో శనివారం భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించినట్లు చెబుతున్న 650 ఎకరాల భూమి చుట్టూ కంచె వేసేందుకు రెవెన్యూ, హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో రంగంలోకి దిగడంతో క్షేత్రస్థాయి రణరంగంగా మారింది. అధికారుల చర్యను నిరసిస్తూ రైతులు, గ్రామస్థులు ఎదురుతిరగడంతో పరిస్థితి చేయిదాటింది.
కంచె వేసేందుకు అధికారుల యత్నం.. అడ్డుకున్న రైతులు

హైడ్రా, రెవెన్యూ విభాగాల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో, వందలాది మంది పోలీసుల మోహరింపు మధ్య భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని, నష్టపరిహారం చెల్లింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రైతులు అధికారులను అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీవో శ్రీధర్‌తో రైతులు, మహిళలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
తోపులాటలో రైతుకు అస్వస్థత.. అంబులెన్స్ అడ్డగింత

రైతులను చెదరగొట్టి కంచె వేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో నరసింహ అనే స్థానిక రైతు తీవ్ర ఆందోళనకు గురై స్పృహతప్పి పడిపోయారు. అస్వస్థతకు గురైన అతడిని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, తోటి రైతులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసిన తర్వాతే కంచె వేయాలని డిమాండ్ చేశారు. మా భూములకు సరైన న్యాయం జరిగే వరకు, పరిహారంపై స్పష్టత వచ్చే వరకు ఇక్కడి నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా తాకనివ్వం. ప్రాణాలు పోయినా సరే కంచె వేయనిచ్చేది లేదు" అని రైతులు తెగేసి చెప్పారు. ప్రస్తుతం బహదూర్గూడలో పరిస్థితి 'నివురు గప్పిన నిప్పు' లా మారింది.మెగా ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న రైతులు, ప్రభుత్వం తమకు ప్రకటించిన పరిహారం సరిపోదనే అసంతృప్తితో ఉన్నారు. అధికారుల ముందస్తు నోటీసులు లేదా చర్చలు లేకుండా ఏకపక్షంగా కంచె వేయడానికి రావడం వారి ఆగ్రహాన్ని మరింత పెంచింది.
హైడ్రా ఎంట్రీతో పెరిగిన భయం....

సాధారణంగా రెవెన్యూ, పోలీస్ శాఖలు మాత్రమే ఇలాంటి చర్యల్లో పాల్గొంటాయి. కానీ ఈసారి 'హైడ్రా' బలగాలను రంగంలోకి దించడం చూస్తే, ప్రభుత్వం ఈ భూసేకరణను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ఇది స్థానికుల్లో మరింత భయాందోళనలకు కారణమైంది. ఒక రైతునరసింహ స్పృహతప్పి పడిపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా మోహరించినప్పటికీ, లోపల ఉన్న అసంతృప్తి ఎప్పుడైనా మళ్లీ హింసాత్మకంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం కేవలం పోలీసు బలగాల ప్రదర్శనతో భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఘర్షణలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఆర్డీవో లేదా ఉన్నతాధికారులు రైతులతో శాంతియుతంగా చర్చలు జరిపి, నష్టపరిహారంపై స్పష్టమైన హామీ ఇస్తేనే అక్కడ శాంతి నెలకొనే అవకాశం కనిపిస్తోంది.







