calender_icon.png 4 February, 2026 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డదారిలో ఏకగ్రీవానికి హస్తం అడుగులు..!

04-02-2026 10:19:32 AM

  1. 15వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని లాగేసుకున్న కాంగ్రెస్.
  2. మరో ఇద్దరి ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాళం ఒకరు డ్రాప్, మరొకరితో సంప్రదింపుల డ్రామా.
  3. చివరి క్షణంలో తేరుకున్న ప్రతిపక్షం.
  4. రంగంలోకి మాజీ ఎమ్మెల్యే మర్రి. అభ్యర్థి ఇంటి ముందు హైడ్రామా. చివరికి బిఆర్ఎస్ టికెట్. 
  5. ఫలించని అధికార పార్టీ వ్యూహం.
  6. ఇతర వార్డుల్లోనూ ఇదే విధమైన హైడ్రామా.
  7. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో వేడెక్కిన ఎన్నికల రాజకీయం. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మున్సిపాలిటీనీ(Nagarkurnool Municipality) కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు కత్తులు దూస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎన్నికల వేడి పెంచుతున్నారు. మంగళవారం నామినేషన్ విత్ డ్రా సమయం ముగిసే సమయానికి  నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య హైడ్రామా నెలకొంది.

15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌసియా భేగం ఇసాక్ ఏకగ్రీవం కోసం బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీలో దిగిన అభ్యర్థి తవిటి ఇందిర నిరంజన్ లను మాజీ కౌన్సిలర్ ఇసాక్ స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేర్చుకున్నారు. దాంతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులను సైతం విత్ డ్రా చేయించి ఏకగ్రీవం కోసం ప్రయత్నించగా ఒకరు వారి నామినేషన్ ఉపసంహరించుకోగా మరో అభ్యర్థి వద్ద కాంగ్రెస్ పార్టీ లోని ప్రధాన లీడర్లు నసీమా భేగంతో సంప్రదింపులు జరిపారు. ఆలస్యంగా తెరుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

దీంతో ఎస్సై గోవర్ధన్ రక్షణ కల్పిస్తూ భరోసా ఇవ్వడంతో అభ్యర్థి నిర్ణయం మేరకు బిఆర్ఎస్ పార్టీ బి ఫామ్ తో బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఇదే తరహాలో మరికొన్ని వార్డుల్లోనూ నాటకీయ పరిణామం మధ్య అభ్యర్థులు కంట తడి పెట్టుకుంటూ నామినేషన్ విత్ డ్రా చేసుకోగా 24 వార్డులకు గాను 102 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో పక్క 6వ వార్డులో టికెట్టు ఆశించిన కాంగ్రెస్ పార్టీ లీడర్ తనకు పార్టీలో అవమానం జరిగిందంటూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి స్వతంత్రునిగా బరిలో నిలిచారు.