16 April, 2026 | 4:07 AM

ఏజెన్సీ ప్రాంతంలో వర్శిటీ ఏర్పాటు కృషి

16-04-2026 01:22 AM

జాతీయ సదస్సులో ఎంపీ నగేష్

ఉట్నూర్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి):  ఆదిలాబాద్ జిల్లాకు మంజూరు చేసే విశ్వవిద్యాల యాన్ని ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఎం పీ నగేష్ అన్నారు. బుధవారం ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్ లో  గిరిజన అభివృద్ధి -  ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ, సుస్థిర కోసం సమ గ్ర  వ్యూహాలు, అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సును ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి డిగ్రీ కళాశాల విద్యార్థులు, విశ్వవిద్యాలయాల ప్రొఫె సర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ నగేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా గిరిజనులు తరతరాలుగా తమ సంస్కృతి సాంప్రదాయాలను  పాటిస్తున్నార ని, కానీ నేటికి గిరిజనులు ఆర్థికంగా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి సాంప్రదాయాల ను కాపాడుతు వస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యతో పాటు సాంకేతిక విద్య, ఏఐ టెక్నాలజీ  అవసరమన్నారు.

ఈ సదస్సులో ఉట్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ యాదవ్, డిగ్రీ కళాశాల  ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగం హెచ్. ఓ. డి ప్రొఫెసర్ వాగ్మారే మాయాదేవి తోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు విజయ్ కుమార్, నాగాలాండ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాంబో, బీఈడీ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, ప్రొఫెసర్ అనిల్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.