5 June, 2026 | 4:57 AM

కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి

05-06-2026 01:19 AM

వార్డు సభలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, జూన్ 4 (విజయక్రాంతి) :  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక‘ ద్వారానే పట్టణాల్లోని ప్రతీ వార్డు సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా గురువారం పట్టణంలోని 45వ వార్డు భుక్తాపూర్ కాలనీలో నిర్వహించిన వార్డు సభకు మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం వేసవి శిక్షణ శిభిరం స్విమ్మింగ్ పోటీలలో రెండవ బహుమతి పొందిన మున్సిపల్ చైర్పర్సన్ దంపతుల కుమార్తె బండారి అమిత కు కలెక్టర్ ప్రశంస పత్రాన్ని అందజేసి అభినందించారు.   వార్డు ప్రజల అవసరాలకు అనుగుణంగా అధికారులు ప్రగతి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలు భాగస్వాములు కావాలని, అప్పుడే వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందన్నారు.  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఈఓ మాధవి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వార్డ్ ప్రత్యేక అధికారి నిహారిక, వివిధ శాఖల జిల్లా అధికారులు, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.