సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి
మున్సిపల్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు సిబ్బందితో మంత్రి సమీక్ష
రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖల మంత్రి డా. వాకిటి శ్రీహరి
వనపర్తి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను యుద్ధప్రాతిపదికంగా పరిష్కరించేందుకు అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖల మంత్రి డా. వాకిటి శ్రీహరి ఆదేశించారు. గురువారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో కొత్తగా ఎంపికైన వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య, పారిశుధ్యం సమస్యలు లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో సాయంత్రం 6.00 గంటలకు వీధి దీపాలు వెలగాలని, ఉదయం 6 గంటలకు ఆఫ్ కావాలని సూచించారు. మధ్యాహ్నం సమయంలో వీధి దీపాలు వెలగడం, రాత్రి వీధి దీపాలు వెలగకపోవడం వంటి సమస్యలు లేకుండా చూడాలని అందుకు అవసరమైన విద్యుత్ సామాగ్రి అడిగితే వెంటనే మంజూరు చేయిస్తానని అన్నారు. లో ఓల్టేజ్ ఇబ్బంది ఎక్కడ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.
మున్సిపాలిటీలో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. అధికారులకు తమ పనిమీద పట్టు లేకుంటే మాత్రం చర్యలు తప్పవని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య , మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి, వైస్ చైర్ పర్సన్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శశిధర్, కొత్తగా ఎంపికైన మున్సిపల్ కౌన్సిలర్లు, తహసిల్దార్ చాంద్ పాషా, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




