హుజూర్‌నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్ద్దేందుకు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
హుజూర్ నగర్, మార్చి 31: హుజూర్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు నూతన పాలకవర్గం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ బడ్జెట్ 2026 - 27 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ పై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...మున్సిపాలిటీ అభివృద్ధికి పాలకవర్గం సహకరించాలని మున్సిపల్ నిధులను సక్రమంగా వినియోగించి సత్ఫాలితాలు రాబట్టలని కోరారు.మున్సిపాలిటీ 2026 -27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.33 కోట్లతో బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు.
మున్సిపాలిటీని దశల వారీగా అభివృద్ధి చేసుకునేందుకు పాలక వర్గం కృషి చేయాలన్నారు. వార్డులలో ఉన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని, ప్రాధాన్యత అంశాలైన త్రాగునీరు, పరిశ్యుధ్యం, రోడ్లకు సంబంధించిన పనుల కోసం ప్రత్యేక గ్రాంట్ల నిధులను వినియోగించుకుని పూర్తి చేయాలని తెలిపారు. రానున్న వేసవికాలం దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.వార్డులలోని ముఖ్యమైన ప్రదేశాలలో వీధిలైట్లు ఏర్పాటు చేస్తే మహిళ భద్రత కల్పించడం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనంతరం రామస్వామి గుట్ట మోడల్ కాలనీ ఇందిరమ్మ ఇండ్లను అధికారులతో కలసి పరిశీలించి పలు సూచనలు చేశారు.అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆర్డిఓను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు,మున్సిపల్ చైర్ పర్సన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసిల్దార్ కవిత, మున్సిపల్ కౌన్సిలర్లు, పాల్గొన్నారు.




