గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
రూ.3 కోట్లతో రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలం పాత రౌట సంకపల్లి, పర్శ నంబాల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ పిఎం జన్ మన పథకం ద్వారా మంజూరైన రూ.3 కోట్ల నిధులతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి శనివారం భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే పాత రౌట సంకపల్లి, పర్శ నంబాల గ్రామాల ప్రజల ఎన్నో ఏళ్లుగా ఉన్న రవాణా సమస్యలు తీరుతాయని, గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక సేవలకు గ్రామీణ ప్రజలు సులభంగా చేరుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ్, కిష్టయ్య,ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






