10 May, 2026 | 2:06 AM

11 నుంచి విద్యా వారోత్సవాలు

10-05-2026 12:00 AM

జయప్రదం చేయాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా శాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కలెక్టర్లను ఆదేశించారు. విద్యా వారోత్సవాల నిర్వహణపై సంబంధిత ఉన్నతాధికారులతో కలసి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ.. ఈ నెల 11న ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించనున్న విద్యావారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు బారి సంఖ్యలో హాజరయ్యేలా కలెక్టర్లు చొరవతీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

అంతకుముందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించిన పురోగతి, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు, జనాభా స్వీయ గణనకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో, జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు.

కాన్ఫరెన్స్‌లో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, కళాశాల  విద్యా శాఖ కమీషనర్ దేవసేన, పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.