17 July, 2026 | 6:29 PM

నూతన సబ్ కోర్టు మంజూరు చేయాలని కోరిన దమ్మపేట బార్ అసోసియేషన్

17-07-2026 06:21 PM

దమ్మపేట,(విజయక్రాంతి): జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దమ్మపేట బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్‌లోని రాష్ట్ర హైకోర్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోర్ట్‌ఫోలియో న్యాయమూర్తులు జస్టిస్ జె.శ్రీనివాసరావు, జస్టిస్ కె.శరత్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దమ్మపేట కోర్టులో నెలకొన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దమ్మపేట కోర్టులో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, కోర్టు ఉద్యోగుల కొరతను నివారించాలని వారు కోరారు.

దమ్మపేటలో నూతనంగా సబ్ కోర్టు ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయాలని, అలాగే కోర్టు ఆవరణలో న్యాయదేవత విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు. బార్ అసోసియేషన్ సభ్యుల వినతులపై జస్టిస్ జె.శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారని ప్రతినిధులు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన వారిలో దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్, జనరల్ సెక్రటరీ లక్కినేని నరేంద్రబాబు, హై కోర్టు న్యాయవాది పెనుబల్లి రమేష్, ట్రెజరర్ తామ బాలరాజు, గేమ్స్ సెక్రటరీ తీర్నతి సంజయ్ తదితరులు ఉన్నారు.