17 July, 2026 | 6:30 PM

గిరిజన గ్రామాల్లో విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

17-07-2026 06:24 PM

ఐటీడీఏ ఉట్నూరు ప్రాజెక్టు అధికారి మంద మకరందు

ఉట్నూరు,(విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. శుక్రవారం ఉట్నూరు మండలంలోని దొంగ చింత గిరిజన గ్రామంలో ఆయన  పర్యటించి గ్రామంలోని పరిస్థితులను పరిశీలించారు. గ్రామానికి చేరుకున్న ప్రాజెక్టు అధికారికి స్థానిక గిరిజనులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలు, విద్యా పరిస్థితులపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అమరవీరులకు ఘన నివాళి..

పర్యటనలో భాగంగా గ్రామంలోని గిరిజన వీరులైన కొమరం సూర్ మరియు కొమురం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజనుల హక్కులు, జల-జంగల్-జమీన్ పరిరక్షణ కోసం పోరాడిన మహనీయుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ..

అనంతరం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పీవో మంద మకరందు, తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధనా విధానం, పాఠశాల రికార్డులు, మధ్యాహ్న భోజన నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా సదుపాయాలు, మౌలిక వసతులపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థులతో ముఖాముఖి.. చదువుపై ప్రోత్సాహం

పాఠశాలలో విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించిన ప్రాజెక్టు అధికారి, వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాలు, రోజువారీ అభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని,  సూచించారు.

 విద్యార్థులతో కలిసి కొంతసేపు గడుపుతూ వారిలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని నింపారు.

గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ప్రాజెక్టు అధికారి ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన, పౌష్టికాహారం, పరిశుభ్రమైన పాఠశాల వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు .

గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్న పీవో

పర్యటన సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, శాశ్వత నీటి సౌకర్యం కల్పించాలని ప్రాజెక్టు అధికారిని కోరారు. దీనిపై స్పందించిన మంద మకరందు సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఐటీడీఏ తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో  ఐటీడీఏ ఏపీవో జనరల్  వసంతరావు జాదవ్, అధికారులు,స్థానిక  పాల్గొన్నారు.