calender_icon.png 17 February, 2026 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్కంటి చెంత భక్తి పారవశ్యం

16-02-2026 12:00:00 AM

  1. తీర్థాల, కూసుమంచి, బెండాలపాడు క్షేత్రాల్లో కుటుంబ సమేతంగా పూజలు

వేద ఆశీర్వచనాల మధ్య మంత్రి దంపతులకు ఆలయాల్లో ఘన స్వాగతం

రఘనాథపాలెం /ఖమ్మం, ఫిబ్రవరి 15(విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినం వేళ ముక్కంటి చెంత భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు తమ ముద్దుల మనుమరాలు మైరాతో కలిసి ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను సందర్శించారు.

పసిప్రాయంలోనే భక్తిభావంతో స్వామివారిని దర్శించుకుంటున్న మైరా మురిపెంలో మంత్రి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంలో మునిగితేలారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సాగిన ఈ పర్యటనలో మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు.

తీర్థాల, కూసుమంచిలో  ఆధ్యాత్మిక వెలుగులు

మంత్రి కుటుంబం తొలుత పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం తీర్థాల శ్రీ సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. త్రివేణి సంగమ క్షేత్రంలో వెలసిన స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మనుమరాలు మైరాతో కలిసి మంత్రి దంపతులు పూజల్లో పాల్గొన్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం చారిత్రక ప్రసిద్ధి గాంచిన కూసుమంచి శ్రీ గణపేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువుటద్దంగా నిలిచే ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

బెండాలపాడు వీరభద్రుడికి నీరాజనం

పర్యటనలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం బెండాలపాడులోని పల్లెర్లబావి శ్రీ వీరభద్రస్వామి వారిని మంత్రి దంపతులు సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో మంత్రి దంపతులతో పాటు చిన్నారి మైరాకు అర్చకులు ఆత్మీయ స్వాగతం పలికారు. వీరభద్రుడి సన్నిధిలో భక్తిప్రపత్తులతో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొన్నారు. 

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి..

దర్శనానంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ‘మహాశివరాత్రి పర్వదినాన  రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విరాజిల్లాలని, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుడిని వేడుకున్నాను‘ అని తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.