18 May, 2026 | 3:29 AM

ఎబోలా ఎమర్జెన్సీ

18-05-2026 12:40 AM
  1. డబ్ల్యూహెచ్‌వో ప్రకటన
  2. కాంగోలో ప్రాణాలు విడిచిన 88మంది, 300 మందికి సోకిన వైరస్
  3. బండిబుగ్యో వైరస్ కారణం.. దీనికి మందులు, వ్యాక్సిన్లు లేవు

న్యూఢిల్లీ, మే 17: ఆఫ్రికా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ సోకి 88 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 300మంది ఈ వైరస్ బారిన పడ్డారని అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఆదివారం (డబ్ల్యూహెచ్‌వో) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. దీనివల్ల ప్రపంచదేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది.

ఇతరదేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం వ్యాపిస్తున్న ఎబోలాకు బండిబుగ్యో అనే వైరస్ కారణమని, దీనికి మందులు, వ్యాక్సిన్లు లేవని తెలిపారు. ఈ వ్యాధి సోకినవారిలో జ్వరం, కండరాల నొప్పి, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి ఉంటాయి. ఆ తర్వాత వాంతులు, విరేచనాలు, దద్దుర్లు, రక్తస్రావం అవుతుంది. వ్యాప్తిని తగ్గించడానికి, నిర్ధారిత కేసులను వెంటనే వేరుచేసి, కనీసం 48 గంటల వ్యవధిలో నిర్వహించిన రెండు బండిబుగ్యో వైరస్- నిర్దిష్ట పరీక్షలు నెగటివ్‌గా వచ్చే వరకు చికిత్స అందించాలని ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఎబోలాను కాంగోలో 1976లో గుర్తించినప్పటి నుంచి ఇది 17వ సారి వ్యాప్తి చెందింది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. వైరస్ భయంతో ప్రపంచ సరిహద్దులను మూసివేయవద్దని ప్రజలకు, ప్రయాణికులు, వాణిజ్య ఆంక్షలను విధించవద్దని పేర్కొంది. వైరస్ లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ చేసి చికిత్స అందించాలని కాంగో ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్‌వో సూచించింది.