18 May, 2026 | 1:57 AM

భారత్ చేరిన మరో ఎల్పీజీ నౌక

18-05-2026 12:38 AM

20వేల టన్నుల గ్యాస్‌తో సురక్షితంగా గుజరాత్ పోర్టుకు

న్యూఢిల్లీ, మే 17: ఎల్పీజీని తీసుకువస్తున్న మరో భారతనౌక ‘సైమీ’ భారత్‌కు చేరుకుంది. ఆదివారం గుజరాత్‌లోని కాండ్లాపోర్టుకు వచ్చింది. ఈ ట్యాంకర్‌లో 20వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఖతార్‌లోని రాస్ లఫాన్ టెర్మినల్ నుంచి బయల్దేరిన ఈ క్యారియర్ మే 13న హర్ముజ్‌ను దాటింది. మరోనౌక సన్‌షైన్ 46,427 టన్నుల ఎల్పీజీతో గురువారం హర్ముజ్‌ను దాటింది. ఇది కూడా సోమవారం నాటికి న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.

ఈ రెండు నౌకల్లోని వంటగ్యాస్ ఐవోసీ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్)కు చెందింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తరువాత హర్ముజ్‌ను దాటిని భారత నౌకల సంఖ్య 15కు చేరింది. మరో 12 నౌకలు గల్ఫ్‌లోనే ఉన్నాయి. వీటిని కూడా సురక్షితంగా రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాల్లో నిమగ్నమైంది. కాగా నౌకలను సురక్షితంగా హర్ముజ్‌ను దాటించేందుకు భారత నౌకాదళంతో సహా పలు సంస్థలు, దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ కూడా జలసంధి నుంచి సురక్షితంగా నౌకలను పంపించేందుకు చర్యలు తీసుకుంటుంది.