లారీ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం
నిర్మల్ జూన్ 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా రూరల్ మండలంలోని మేడిపల్లి 44వ జాతీయ రహదారిపై గురువారం ఎక్కువ జామున లారీ డ్రైవర్ జువార్ రాజపుత్ర సింగ్( 50) సజీవ దహనం అయ్యారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అదిలాబాదు నుంచి హైదరాబాద్ సామాగ్రితో వెళ్తున్న లారీ మేడిపల్లి వద్ద ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
అదిలాబాద్ జిల్లా సోనాల మండలం కేంద్రానికి చెందిన జువా రాజపుత్ సింగ్ డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కున్నారు. ఇంజన్ నుంచి మంటలు రావడంతో వేకువజామున 3:00 సమయంలో ఎవరూ లేకపోవడంతో అందులోని ఇరుక్కొని సజీవ దహనం అయినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇతర వాహనదారులు లారీలో ఇరుక్కున్న డ్రైవర్ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేవు.
నిర్మల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసు బృందంతో అక్కడికి వెళ్లి క్రేన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టిన అప్పటికి డ్రైవర్ పూర్తిగా కాలిపోయి మృతి చెందినట్లు తెలిపారు. డ్రైవర్ నడుపుతున్న లారీ ముందు టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి వెనుక నుంచి మరో లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. పార్కింగ్ స్థలంలోని మాత్రమే జాతీయ రహదారిపై వాహనాలు నిలపాలని పోలీసులు పేర్కొంటున్నారు.






