రెండు రోజులకోసారి నీళ్లు..
బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు..
స్పందించని అధికారులు..
తాడ్వాయి, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం, గ్రామాల్లో ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం, అందుకు అనుగుణంగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాం అని చెబుతున్న అధికారులు ఆచరణలో మాత్రం చేయడం లేదు. ప్రజలు దాహార్తితో అల్లాడుతున్న పట్టించుకోవడం లేదు.ప్రజలు బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామం లో ప్రజలు దాహం.. దాహం... అంటూ అల్లాడిపోతున్నారు. తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రెండు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా కావడంతో ప్రజలు చాలీ చాలని నీళ్లతో తమ అవసరాలు తీర్చుకుంటున్నారు.రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ తో నీటిని సరఫరా చేసిన పూర్తిస్థాయిలో నీళ్లు సరఫరా చేయడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి ముందు నీటి క్యాన్లు పెట్టుకుంటేనే నీళ్లు..
గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ తో నీళ్లు పోస్తున్నారు. కానీ ఇంటిముందు ట్యాంకు డబ్బాలు పెట్టుకుంటేనే ఆ డబ్బాలో నీళ్లు పోస్తున్నారు. లేదంటే నీళ్లు పోయకుండా నిరాకరిస్తున్నారు. తాము బిందెలు తీసుకొని వెళితే నీళ్లు పోయడం లేదు. దీంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే మీరు నీటి ట్యాంకులు తెచ్చుకోండి అని చెబుతున్నారన్నారు. దీంతో ట్యాంకులు లేని మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
గ్రామంలో రెండు వాటర్ ట్యాంకులు..
బ్రహ్మాజీ వాడి గ్రామంలో రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి.గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంకు లోకి గ్రామంలోని బోరు బావుల ద్వారా నీటిని నింపుతున్నారు ఈ ట్యాంకు నుంచి గ్రామంలోని బీసీ కాలనీకి నీటిని సరఫరా చేస్తున్నారు. మరో ట్యాంకు ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉంది ఈ వాటర్ ట్యాంకు ను మిషిన్ భగీరథ నీళ్లతో నింపుతున్నారు.కానీ మిషన్ భగీరథ నీళ్లు రాని సమయంలో ఎస్సీ కాలనీకి నీటి సరఫరా నిలిపి చేస్తున్నారు.దీంతో ఎస్సీ కాలానివాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఎస్సీ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని వాపోతున్నారు.
వారం రోజులు నీళ్లు బంద్
ఇటీవల పాఠశాల ఆవరణలోని నీటి ట్యాంకు కు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో వారం రోజులపాటు ఎస్సీ కాలనీకి నీళ్లు రాలేవు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము బిందెడు నీటి కోసం మల్లన్న దేవుని దగ్గర ఉన్న బోరుబావి నుంచి నీళ్లు తెచ్చుకుని దాహార్తి తీర్చుకున్నామని వారు తెలిపారు.
క్రమం తప్పకుండా తాగునీటిని సరఫరా చేయాలి
గ్రామంలో మా కాలనీ కి ఎందుకు నీళ్లు సరఫరా చేయరు. ప్రతిరోజు క్రమం తప్పకుండా నీటిని సరఫరా చేయాలి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమకు బాధలు తప్పడం లేదు. గ్రామపంచాయతీ పాలకవర్గం సైతం పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.ఒక్క బ్రహ్మాజీ వాడి గ్రామంలోనే కాకుండా తాడ్వాయి మండలంలోని కొన్ని గ్రామాలలో, జిల్లాలోని చాలా గ్రామాలలో సైతం తీవ్రమైన తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని నీటి ఇబ్బందులు ఉన్న గ్రామాలను గుర్తించి వెంటనే తాగు నీటి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నాం.
మా కాలనీకి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.ప్రతిరోజు నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి నీళ్లు రావడంతో మాకు అవస్థలు ఏర్పడుతున్నాయి.
- నాంపల్లి, గ్రామసుడు, బ్రహ్మాజీవాడి
మల్లన్న దేవుడి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం
రోజు మాకు నీళ్లు రాకపోవడంతో మల్లన్న దేవుడి దగ్గర ఉన్న బోరు బావి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం.తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం..అధికారులు స్పందించి రోజు నీళ్లు వచ్చేలా చూడాలి.
మోతే సంజీవులు, గ్రామస్తుడు, బ్రహ్మాజీవాడి
వాటర్ డబ్బాలు ఉంటేనే నీళ్లు పోస్తున్నారు
మా ఇంటి ముందు నీళ్ల డబ్బాలు ఉంటేనే వాటర్ ట్యాంక్ నుంచి డబ్బాలో నీళ్లు పోస్తున్నారు. వాటర్ డబ్బాలు లేకుంటే పోయడం లేదు. బిందెల తో పట్టుకుందామంటే పట్టుకోనిస్తలేరు. మాకు సరిపోయే నీళ్లు అందించాలి.
- కూరెళ్ళి భూధవ్వ, గ్రామస్తురాలు, బ్రహ్మాజీవాడి






