12 June, 2026 | 2:30 AM

రామాయంపేటలో రూ.2 కోట్ల డ్రైనేజీ పనులకు శ్రీకారం

12-06-2026 12:16 AM

రామాయంపేట, జూన్ 11 : గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రామాయంపేట పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా మున్సిపల్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. వర్షాకాలాన్ని ముందుగానే దృష్టిలో పెట్టుకుని ఐదో వార్డులో జనతా మెస్ సమీపంలో డ్రైనేజీ పునర్నిర్మాణ పనులను ఐదో వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత ఆధ్వర్యంలోగురువారం  ప్రారంభించడం జరిగింది.

పట్టణం లో ప్రతి వర్షాకాలంలో నీటి నిల్వలు, వరదల సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరి ష్కారం లక్ష్యంగా తాసిల్దార్ కార్యాలయం నుంచి మల్లెచెరువు వరకు భారీ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసింది.  ఈ సందర్భంగా కౌన్సిలర్ చౌదరి చరిత మాట్లాడుతూ గతంలో వరదల కారణంగా కొట్టుకుపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించడం ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమన్నారు.

వర్షాలు ప్రారంభమయ్యేలోపే పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దెల మాధవి రమేష్, కోక్కు ప్రవీణ్, పుట్టి సందీప్, గొగ్లోత్ రవి, దేవుని రంజిత్,టీఆర్‌ఎస్ నాయకులు చౌదరి సుప్రభాత్ రావు, అల్లాడి వెంకట్, రేవెల్లి వినయ్ సాగర్, కాంగ్రెస్ నాయకులు రమేశ్ రెడ్డి, పోచమ్మల గణేష్,డాకి స్వామి చింతల యాదగిరి, విప్లవ్ కుమార్, చింతల స్వామి,తదితరులు పాల్గొన్నారు.