8 August, 2026 | 10:58 PM

రూ. 76 లక్షల నిధులతో డ్రైనేజి పనులు

08-08-2026 09:42 PM

కొనసాగుతుండగానే కూలిపోయిన వైనం 

నాణ్యత లోపమేనంటూ విమర్శల వెల్లువ

కుభీర్,(విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యమా..? కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమో తెలియడం లేదు కానీ మేదరి గల్లీ నుండి పెద్దవాన వరకు ఈజీఎస్ నిధులు రూ. 76 లక్షలతో చేపట్టి నిర్మాణంలో ఉన్న హై లెవెల్ డ్రైనేజీ పనులు కొనసాగుతుండగానే కూలిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో గత నెలలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పర్యటించగా స్థానిక మేదరగల్లి వాసులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగులు, శ్రీ విఠలేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులు డ్రైనేజీని నిర్మించాలని వర్షాకాలంలో గల్లీలో మురుగునీరు ప్రవేశిస్తుంది.

శ్రీ విఠలేశ్వర పవిత్ర ఆలయంలోకి మురుగునీరు చొరబడడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దుర్గంధంతో  విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయని పెద్ద డ్రైనేజీ నిర్మిస్తే తప్ప ఈ ప్రాంత వాసులకు సాంత్వన లభించదని వేడుకున్నారు. వేడుకున్నారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులతో ఎస్టిమేషన్ వేయించి రూ. 76 లక్షల ఈజీఎస్ నిధులను మంజూరు చేశారు.

ప్రత్యేక చొరవతో నాలుగు కాలాలపాటు ఉండేందుకుగాను ప్రత్యేక చొరవ చూయించి నిధులు మంజూరు చేయించిన  జిల్లా కలెక్టర్ కి తలవంపులు తెచ్చేలా నాసిరకంగా నిర్మాణ పనులు చేపట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాల కోసం మంజూరైన రూ.76 లక్షల EGS నిధులతో పనులు కొనసాగుతుండగానే నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడంతో కూలిపోయాయి. దీంతో ప్రజాధనం పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మిషన్ భగీరథ ట్యాంకు కింద పైపుల్లోకి చేరుతున్న మురికినీరు 

డ్రైనేజీ గోడలు కూలిపోవడంతో వర్షాకాలంలో మురుగు నీరు PHC, మిషన్ భగీరథ ట్యాంకు కిందకు చేరి ఉతికి తాగునీరు కలుషితం అవుతోంది. కలుషితం అవుతుంది ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన పనులు ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి నెలకొంది.  

అధికారుల నిర్లక్ష్యమే కారణమా..? 

ఇంత పెద్ద మొత్తం నిధులతో చేపట్టిన పనులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించారా? నిర్మాణ సమయంలో నాణ్యతా పరీక్షలు నిర్వహించారా?  అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే పనుల్లో నాణ్యత తగ్గిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.

సమగ్ర విచారణకు డిమాండ్

కూలిపోయిన డ్రైనేజీ గోడలను సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిశీలించి, సాంకేతిక నిపుణులతో నాణ్యతా ప్రమాణాలపై తనిఖీ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.