డ్రాగన్ వార్నింగ్
ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో అమెరికా జోక్యం వద్దు: చైనా
హోర్ముజ్ దిగ్బంధం సరికాదని చురకలు
అమెరికా ఆంక్షలను ధిక్కరించి జలసంధి దాటిన చైనా నౌక
లైబీరియా, కొమొరోస్‌కు చెందిన మరో రెండు నౌకలూ బయటకు..
బీజింగ్, ఏప్రిల్ 14: ఇరాన్‌తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా బలమైన హెచ్చరికలు జారీచేసింది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాలను తూర్పారబట్టింది. జలసంధి వద్ద అమెరికా నావల్ బ్లాకేడ్ (నావికాదళ దిగ్బంధం)ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరాన్ రేవుల నుంచి వచ్చే ఏ దేశానికి చెందిన నౌకనైనా తనిఖీ చేస్తామని అమెరికా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమకు ఇరాన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ముఖ్యమని స్పష్టం చేసింది. జలసంధి నుంచి ఎలాంటి నౌకల రవాణా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉద్ఘాటించింది. జలసంధి ఇరాన్ నియంత్రణ లోనే ఉందని, చైనా నౌకలకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని తేల్చిచెప్పింది.
తమ నౌకలను అమెరికా అడ్డుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ ప్రకటన విడుదల చేశారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు కట్టుబడి ఉన్నామని, అందుకు అవసరమైన తమ విదేశాంగశాఖ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
జలసంధిని దాటిన ఒక చైనా నౌక..
హోర్ముజ్ జలసంధిలో అమెరికా విధించిన నావల్ బ్లాకేడ్‌కు తొలిరోజే సవాల్ ఎదురైంది. అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్న ఒక చైనా (రిచ్‌స్టార్రీ) నౌక మంగళవారం సునాయాసంగా జలసంధిని దాటింది. ట్రంప్ విధించిన ఆంక్షల తర్వాత జలసంధి నుంచి బయటకు వచ్చిన మొట్టమొదటి నౌక ఇదే. ఈ పరిణామంపై ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది. ట్రంప్ చిన్న చిన్న దేశాలను బెదిరించవచ్చు కానీ, చౌనా వంటి పెద్ద దేశంతో పెట్టుకోలేదని ఎద్దేవా చేశారు.
రానున్న రోజుల్లో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లనున్న తరుణంలో ఈ వివాదం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలావుండగా, చైనా నౌక ‘రిచ్‌స్టార్రీ’ జలసంధి దాటిన కొద్ది గంటల తర్వాత మరో రెండు నౌకలు జలసంధిని దాటాయి. వాటిలో ఒకటి లైబీరియాకు చెందిన ‘కెప్లర్’ కాగా, మరో నౌక కొమొరోస్‌కు చెందిన ‘ఎల్విస్’ నౌక. వీటిలో కెప్లర్ నౌక ఇరాన్‌లో మొక్కజొన్నలు దిగుమతి చేసి వెనుదిరగగా, మరో నౌక ఎల్విస్ ఇంధన నిల్వలతో తమ దేశం వైపునకు పయనించింది.






