నిమ్స్‌ను సందర్శించిన డాక్టర్ హరీష్ సీతామరాజు
పంజాగుట్ట, ఆగస్టు 18 (విజయక్రాంతి): ప్రముఖ ఊపిరితిత్తుల మార్పిడి నిపుణులు డాక్టర్ హరీష్ సీతామరాజు నిమ్స్ ను సందర్శించారు. మంగళవారం నిర్వహించిన సందర్శనలో భాగంగా అకాడమిక్ టాక్ ను నిర్వహించారు. నిమ్స్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ బృందంతో వివిధ రోగుల కేసులపై సవివరంగా చర్చించారు.
ఊపిరితిత్తుల మార్పిడి కోసం పరిశీలనలో ఉన్న రోగులను పరిశీలించారు. రోగుల ఎంపిక, శస్త్రచికిత్సకు ముందు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడం, శస్త్రచికిత్స సమయంలో, అనంతర సంరక్షణ, ఇన్ఫెక్షన్ల నివారణ, పునరావాసం, దీర్ఘకాలిక ఫాలోఅప్ తదితర అంశాలపై విలువైన సూచనలు అందించారు. ఈ పరస్పర చర్చలు నిమ్స్లోని వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రోటోకాల్ ఆధారిత లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గణనీయంగా దోహదపడ్డాయని నిమ్స్ వైద్యులు తెలిపారు.
డాక్టర్ హరీష్ సీతామరాజు ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమానికి మెడికల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ అమరేష్ రావు, డాక్టర్ గోపాల్, పల్మోనాలజీ విభాగానికి చెందిన డాక్టర్ నరేందర్, డాక్టర్ రాకేష్, అనస్థీషియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అర్చనతో పాటు ఫిజియోథెరపీ బృందం పాల్గొన్నారు.






