మిషన్ భగీరథ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
మేడ్చల్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా ఘనాపూర్ లో చేపడుతున్న మిషన్ భగీరథ పనులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ తో కలిసి పరిశీలించారు. అధికారులతో పాటు కాంట్రాక్టర్లను పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రూ. 210 కోట్లతో చేపడుతున్న మిషన్ భగీరథ పనులను దసరా లోగ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో రూ. 1,212 కోట్లతో దాదాపు 2,030 గ్రామాలకు నీరు అందించాలని లక్ష్యంతో చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో 1.400 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందలేదని ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు తాగు నీరుకు పెద్దపీట వేసిందని, ఇందులో భాగంగానే ఘనాపూర్ లో చేపట్టిన మిషన్ భగీరథ పనులకు రూ. 210 కోట్లను మంజూరు చేయించామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ సహకారంతో రూ. 210 కోట్లు మంజూరు చేయించామని, 16 కిలోమీటర్ల మేర తాగునీరు అందాల్సిన పనులు కొంత జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 11 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, మిగతా నాలుగు కిలోమీటర్లకు అటవీ శాఖ అనుమతులు తీసుకున్నమని పనులను వేయవంత చేసి ప్రజల అందుబాటులోకి మిషన్ భగీరథ నీటిని తీసుకొస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు.
వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా ఘనాపూర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, అలియాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ ఓబీసీ జిల్లా చైర్మన్ రవి ముదిరాజ్, మేడ్చల్ డివిజన్ అధ్యక్షులు చాపరాజు, తదితరులు ప్రభుత్వ విప్ వెంట ఉన్నారు.






