వాళ్లకు చట్టాలు ఉండవా?
- ప్రగతి భవన్‌ను పేల్చేస్తానన్న రేవంత్‌రెడ్డి శిక్షార్హుడు కాదా?
- బండి సంజయ్, మైనంపల్లి హన్మంతరావు, అనిరుధ్‌రెడ్డికి చట్టాలు వర్తించవా?
- వారికో నీతి.. బీఆర్‌ఎస్ నాయకులకు ఒక నీతా?
- సింగరేణి కుంభకోణాలను కప్పిపుచ్చేందుకే బాల్క సుమన్ అక్రమ అరెస్టు
- సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం
- రూ. 1600 కోట్ల గోల్‌మాల్‌పై కేంద్రం, సీఎం సమాధానం చెప్పాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి) : ‘గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఆనాడు ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ’ప్రగతి భవన్’ను బాంబులు పెట్టి పేల్చేసినా తప్పులేదు అన్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఎందుకు జైల్లో పెట్టలేదు? ఆయన శిక్షార్హుడు కాదా?’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ పాతబస్తీపై ‘సర్జికల్ స్ట్రైక్’ చేస్తామన్న ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎందుకు చర్యలు లేవు?.. బాల్క సుమన్‌పై పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? అని నిలదీశారు.
సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసి, ‘పెట్రోల్ పోసి తగలబెడతా’ అన్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావుపై, అలాగే ఒక కంపెనీని తగలబెడతానన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై చట్టం ఎందుకు చర్యలు తీసుకోలేదు?.. కాంగ్రెస్ నాయకులకు ఒక నీతి.. బాల్క సుమన్‌కు ఒక నీతా అని ప్రశ్నించారు. బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత కోపం ఎందుకని నిలదీశారు. ఉద్యమంలో బాల్క సుమన్‌పై 220 కేసు లు పెట్టారని, ప్రస్తుతం ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టాలని ప్రభు త్వం చూస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు.
కుంభకోణాలను కప్పి పుచ్చుకునేందుకే..
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, సింగరేణి సంస్థలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌ను అక్రమ కేసులతో జైలులో పెట్టా రని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం చంచల్‌గూడ జైలులో ఉన్న బాల్క సుమన్‌ను బీఆర్‌ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలతో కలిసి కేటీఆర్ ములాకత్ అయ్యారు.
అనంత రం జైలు బయట ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వ అక్రమాలకు, జైలు శిక్షలకు బీఆర్‌ఎస్ భయపడే ప్రసక్తే లేదని, సింగరేణి కార్మికుల పొట్టగొడుతున్న కాంగ్రెస్ సర్కార్‌ను గల్లా పట్టి నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి జరుగుతున్న భారీ కుంభకోణాలను బీఆర్‌ఎస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెడుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో ‘సైట్ విజిటేషన్ సర్టిఫికేట్’ పేరిట జరిగిన రూ. 15,000 కోట్ల కుంభకోణాన్ని బీఆర్‌ఎస్ బహిర్గతం చేసిందన్నారు. అలాగే సోలార్ టెండర్లలో జరిగిన వందల కోట్ల అక్రమాలను బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు బయటపెట్టారని గుర్తుచేశారు. నైనీ బొగ్గు టెండర్ వ్యవహారంలో మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య వాటాలు కుదరక, చివరకు మీడియా ప్రతినిధులను అరెస్ట్ చేసే వరకు వెళ్లారని, ఆ తర్వాత సదరు టెండర్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
సింగరేణి కార్మికుల పొట్టగొడుతున్న కాంగ్రెస్ సర్కార్..
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో సింగరేణి సంస్థలో జరుగుతున్న అన్యాయాలపై బాల్క సుమన్ కార్మికుల పక్షాన నిలబడి గళమెత్తారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా 19 వేల వారసత్వ ఉద్యోగాలు ఇస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది కార్మిక బిడ్డలకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు.
పైగా గతంలో ఇచ్చిన 19 వేల ఉద్యోగాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించి కార్మికుల్లో కలవరం రేపారని మండిపడ్డారు. కార్మికుల ఆక్రోశాన్ని చూసి చలించిపోయిన బాల్క సుమన్ మాట్లాడిన మాటలను వక్రీకరించి, సింగరేణిలో జరుగుతున్న అసలు దోపిడీని కప్పిపుచ్చడానికే ఆయనపై అక్రమంగా పీడీపీపీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పోలీసుల అతి ఉత్సాహాన్ని మెజిస్ట్రేట్ కోర్టు కూడా మందలించి, సదరు సెక్షన్లను తొలగించిందని గుర్తుచేశారు. సింగరేణిలో బడా బాబుల ఆధ్వర్యంలో మైనింగ్ చేయని బొగ్గును చేసినట్టుగా రికార్డులు సృష్టించి రూ. 1,600 కోట్ల మేర గోల్‌మాల్ చేశారని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ భారీ స్కామ్‌పై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి రేపే సమగ్రమైన లేఖ రాస్తానని ఆయన ప్రకటించారు.
ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ములాకత్‌లో బాల్క సుమన్ ఎంతో ధైర్యంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ‘నా గురించి ఎవరూ బాధపడొద్దు, నాకు జైళ్లు, కేసులు కొత్త కాదు. ఉద్యమ కాలంలోనే నాపై 220 కేసులు పెట్టారు.
మంచిర్యాల, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు తీవ్ర ఆక్రోశంలో ఉన్నారు. నాకంటే వారి సమస్యల మీదే దృష్టిపెట్టండి, వారి కోసం పోరా డండి‘ అని సుమన్ తమతో అన్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణిలో జరిగే అక్రమాలు, అన్యాయాలపై కార్మికుల పక్షాన నిలదీస్తూనే ఉంటామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోయేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.






