ప్రాణాలు పోతేనే మరమ్మతులా!
- ప్రమాదాలకు నిలయంగా సీతారామ కెనాల్ బ్రిడ్జి
- ఊడిపోయిన కాంక్రీట్.. బయటపడిన ఇనుప రాడ్లు
- నిత్యం వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం
- ప్రమాదం జరిగితేనే మేల్కొంటారా?..
- అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
బూర్గంపాడు,జూలై27(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురంజింకలగూడెం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఉన్న సీతారామ కెనాల్ బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారింది. బ్రిడ్జిపై కాంక్రీట్ పొర పూర్తిగా దెబ్బతిని ఊడిపోవడంతో లోపలి ఇనుప రాడ్లు బయటపడిపోయాయి.
రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రతిరోజూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జాతీయ రహదారిపై నిత్యం రద్దీ
బూర్గంపాడు, సారపాక, భద్రాచలం, కొ త్తగూడెం ప్రాంతాలను కలిపే ఈ జాతీయ ర హదారిపై రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఐటీసీ, పారిశ్రామి క ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ కీలక రహదారిపై బ్రిడ్జి శిథిలావస్థకు చేరడం తో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
ఇనుప రాడ్లే మృత్యు ఉచ్చులు
బ్రిడ్జిపై కాంక్రీట్ ఊడిపోవడంతో ఇనుప రాడ్లు పైకి లేచిన స్థితిలో కనిపిస్తున్నాయి. వా టిపై బైక్‌లు జారిపడే ప్రమాదం ఉండటమే కాకుండా, వాహనాల టైర్లు పగిలిపోయే అవకాశం కూడా ఉంది. రాత్రి వేళల్లో రాడ్లు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదం మరింత పెరుగుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలతో మరింత దయనీయ పరిస్థితి
వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి పరిస్థితి కనిపించ దు. దీంతో వాహనదారులు గుంతలను అంచనా వేయలేక ఒక్కసారిగా అదుపుతప్పే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలువురు స్వల్ప ప్రమాదాలకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని విమర్శిస్తున్నారు.
ఫిర్యాదులు చేసినా స్పందన కరువు
బ్రిడ్జి దుస్థితిని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు తాత్కాలిక ప్యాచ్వర్క్ చేసినా కొద్ది రోజులకే మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వాపోతున్నారు.
ప్రాణనష్టం జరిగితేనే స్పందిస్తారా?
రోజూ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు వేల సంఖ్యలో ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ సీతారామ కెనాల్ ప్రాజెక్ట్, రోడ్డు-భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రాణాలు పోతేనే మరమ్మతులు చేపడతారా?‘ అంటూ ప్రశ్నిస్తున్నారు.
శాశ్వత మరమ్మతులు చేపట్టాలి
సీతారామ కెనాల్ బ్రిడ్జిపై వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, అప్పటి వరకు హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరింత ఆలస్యం చేస్తే భారీ ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలు బలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.






